అరటిపువ్వులో vitamin E పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిది. అరటిపువ్వు ముఫ్ఫై రోజులు వరుసగా వాడితే బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గుతాయని క్రింద వెబ్సైట్ లో రాసాడు....వాడకం వల్ల శరీరానికి చేకూరే మరిన్ని లాభాల గురించీ ఇక్కడ చూడండి.
ఇదివరకూ అరటిపువ్వు వడలు గురించి రాసాను. ఇప్పుడు పచ్చడి చేస్కుందాo..
ముందుగా ఒక అరటిపువ్వు తీసుకుని, చేతికి కాస్త నూనె రాసుకుని(లేకపోతే వేళ్ళు నల్లగా అయిపోతాయి) ఆ పువ్వులో చివర ఉన్నవి వలుచుకోవాలి. ఆ తరువాత వాటిల్లోంచి క్రింద ఫోటోలో చూపించినవి తొలగించవలెను. లేకపోతే చేదు,వగరు కలగలిపి ఒక వింత టేస్టు వస్తుంది. అది మనం భరించలేము.
* ఆ తర్వాత వాటిని కాస్త ఉప్పు వేసి (క్రింద ఫోలోలాగ) రోటిలో కాస్తంత కచ్చాగా తొక్కుకోవాలి లేదా గ్రైండర్ లో ఒక్కసారి బర్రున తిప్పేసుకోవాలి.
* * ఆ తొక్కిన/గ్రైండ్ చేసిన పదార్ధాన్ని గట్టిగా పిండుకోవాలి. అలా చేయటం వల్ల వగరంతా పోతుందన్నమాట. పిండేసాకా క్రింద ఫోటోలోలా ఉంటుంది.
* అప్పుడొక ముద్ద రెడీ అవుతుంది. అదే మనకు కావాల్సిన పదార్ధం. ఆ ముద్దనే వడలకు, పచ్చడికీ, కూరకూ వాడతారు.
పచ్చడి విధానం:
* అర చెంచాఆవాలు, అర చెంచా మినప్పప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఇంగువ,రెండు ఎండు మిరపకాయలు వేసి పోపు వేయించి పెట్టుకోవాలి.
* తర్వాత పైన చెప్పిన విధంగా పిండేసి పెట్టుకున్న ముద్దను రెండు చెంచల నూనెలో మాడకుండా 2,3mins వేయించాలి.
* వేయించిన ముద్దలో :
నానబెట్టిన (మీడియం సైజు నిమ్మకాయంత) చింతపండు,
తగినంత ఉప్పు(పైన పిండేందుడుకు కాస్త ఉప్పు వేసాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి)
రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి (పోపుతో వేగినవి)
* పైనరాసినవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలోకి తీసాకా వేయించి ఉంచికున్న పోపు వేసి కలుపుకోవాలి.
* టేస్టీ టేస్టీ అరటిపువ్వు పచ్చడి రెడీ. అద్భుతమైన ఆ రుచి కోసం కొంచెం కష్టమైన విధానమే అయినా చేసేసుకోవాలి. తప్పదు మరి...:))
మా ఇంట్లో కూడా అరటి చెట్లున్నాయి. కానీ పువ్వులని ఎలా వండుకోవాలో తెలియక పువ్వులని పారేస్తాం.
@praveen sarma:అయ్యో...ఈసారి పారేయకండీ...
చిన్న సందేహం...పువ్వులని కొయ్యకపోతే అది గెల అయిపోతుంది కదా..?
అరటి పళ్ళు తిన్నాను, అరటికాయ బజ్జీలూ తిన్నాను. కానీ పువ్వులతో వండినది ఇప్పటి వరకు తినలేదు. అందుకే పువ్వులు కూడా పనికొస్తాయని నాకు తెలియదు.