వంకాయతో ఏమాత్రం పోలిక లేని ఈ కూరను "బెంగుళూరు వంకాయ" అని ఎందుకు అంటారో అర్ధం కాదు...:( ఇది బెంగుళూరులో ఎక్కువగా దొరుకుతుందో ఏమో మరి. నార్త్ లో దీన్ని చౌ చౌ(chow chow) అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో chayote అంటారు. చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయి ఇవి. ఇక ఈ కూరతో అమ్మ "కూటు" మాత్రమే చేసేది. ఇదీ కర్ణాటక వంటకమే . చౌ చౌ మార్కెట్లో కొనేప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరిపోతే పీచు వచ్చేసి రుచి బాగుండదు.
అలా జీడి తీసేసిన చౌ చౌ ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని, ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటికి సగం నీరు(ఉడికాకా వార్చాల్సిన అవసరం లేకుండా కొన్నే నీళ్ళన్నమాట) పోసి, కాస్తంత ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చేలా కుక్కర్లో ఉడికించుకోవాలి. ముద్దయిపోతుందనిపిస్తే వీడిగా ఉడకపెట్టుకున్నా త్వరగా అయిపోతుంది. ఇలా ఉడకపెట్టుకున్న కూరముక్కలతో నాలుగైదురకాల కూరలు వండుకోవచ్చు.
1) మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఉట్టిగా పోపు కూర వండుకోవచ్చు. ఆనపకాయ లాగ.
2) పోపు వేసాకా తురిమిన ఫ్రెష్ కొబ్బరి కూరలో వేసుకోవచ్చు. కొబ్బరి వేసే కూరల్లాగ.
3) పోపు కూర చల్లారాకా పచ్చి ఆవపొడి వేసి ఆవ కూరలా కూడా చేయవచ్చు.
4)పొపు వేసాకా దాంట్లోనే నూపొడి కారం ( నువ్వులు వేయించి, కారం కలిపి చేసిన పొడి) వేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద ఉండగానే వేసుకోవచ్చు. క్రింద ఫోలోలా ఉంటుంది.
5) అన్ని కూరముక్కలతో కలిపి లేక ఒక్క చౌ చౌ తో కూటు చేసుకోవచ్చు. "కూటు" గురించి రేపు రాస్తాను.
chow chow పచ్చడి:
తరిగిన చౌ చౌ ముక్కలను కాస్త వేయించి, చింతపండు వేసి (ఆనపకాయముక్కలతో చేసినట్లుగానే) పచ్చడి చేసుకొవచ్చు.
----------- --------------
* ముక్కలు ఉప్పు వేసి ఉడకఎట్టుకుని సలాడ్ లాగ కూడా తినవచ్చు.
ఈ బెంగుళూరు వంకాయ తినటం వల్ల ఉపయోగాలు ఇక్కడ చదవవచ్చు.
భలే...భలే...ఇది బజార్లో కనిపిస్తుందిగానీ ఎప్పుడూ ఇంట్లో వండడం తెలీదు. ఈసారి సాహసం చేసి దీన్ని కొనుక్కురావాలి. మీరన్నట్టు నాకిష్టమైన నూలుగుండ కూర చేసి పడేస్తా.
మరే నాకో డౌటు: పైన చెక్కు తియ్యాలి అన్నారు కదా, అది మన ఆనపకాయంత ఈజీగా ఉంటుందా లేక గుమ్మడికాయలా గట్టిగా ఉంటుందా? పైనున్న తొక్క తీసేస్తా చాలా?
కూట్ కోసం వైటింగ్...త్వరగా...
సౌమ్య గారు, ఈ తొక్కు చాలా పల్చగా ఉంటుండండి.ఈజీగా తీసేయచ్చు.
కూటులో చాలా రకాలున్నాయండీ. రేపు రాసేస్తాలెండి..
Baagundi.. Trushna gaaru. nenu vandataaniki try chesthaanu. Thank you very much
@vanaja vanamaali: pl. try..thank you.
ఈ తీగ మా ఇంట్లో అల్లుకుంటోంది. ఎన్ని కాయలు కాస్తుందో చూడాలి!
కర్నాటక నుంచే తెచ్చాను. కాయ రాలి పడిపోయాక దాని లోని విత్తనం లో మొదలైన మొలకకాయ వెనుక భాగంలో గాడిలా ఉంది చూడండి, అందులోంచి వచ్చి తీగ అల్లుకుంటుంది. విడిగా విత్తనాలు దొరకవు. రెండు మూడు కాయలైనా కాస్తే బాగుణ్ణు, మా ఇంట్లో చౌ చౌ కూడా కాయించేశానని కీర్తి తలకెత్తుకోవచ్చని చూస్తున్నా
తృష్ణ,మీరు మళ్ళీ మన ప్రపంచంలోకి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది.రోజూ మీ టపా వుందేమోనని చూడటం,ఇంకా మీరు బిజీనేమో అనేసుకోవడం.కనువిందుగా మంచి సినిమాల గురించి,జీహ్వకింపుగా మంచివంటల గురించి మీరు రాసినవన్నీ చాలా బాగున్నాయి.బెంగుళూరు వంకాయ తో రొట్టెలలోకి కొంచెం మసాల వేసి చేసిన కూర చాలా బాగుంటుంది.
బెంగుళూరు వంకాయ కాదే - బెంగుళూరు సొరకాయ అంటారు ఈ శాకాన్ని......సాంబారులో వేస్తే నాసామిరంగా! అని మీ నాలిక మీకు అభినందనలు చెబుతుంది....ఐతే కొంచెం పెద్ద ముక్కలుగా కోసి వెయ్యాలి....
హెచ్చరిక: సాంబారులో ఇదీ - కారట్ - ఉల్లిపాయ మాత్రమే స్నేహం...ఇంకేమన్నా వేసారనుకోండి, ఇహ అంతే సంగతులు... అనగా రుచి మాయం....
@సుజాత: అయ్యబాబోయ్..నిజమే...? ఇక లాభం లేదు మీరు పిలవకపొయినా మీ ఇంటికి రావాల్సిందే...! ఇన్ని రకాలు పండించగలుగుతున్నందుకు మీ పై జలసీ వచ్చేస్తోంది.
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి
తృప్తిగా మొక్కలు పెంచుకోలేని
జన్మా ఒక జన్మేనా...
ఇదియే తృష్ణ మాట...:))
@ఇందిర: హలో ఇందిర గారూ, బాగున్నారా? ఇదిగో వచ్చేసాగా బోలెడు కబుర్లతో...:))
అవునండీ ఆ సంగతి రాయటమ్ మర్చిపోయా. ఈ ఒక్కదానితో కాదు కాని అన్నికూరలతో చౌ చౌ కలిపి చపాతీల్లోకి మసాలా కూర చేస్తూంటా నేను.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
@మాగంటి వంశీ మోహన్: మా బెజవాడలో ఇలానే (బెంగుళూరు వంకాయ) అనే అనేవారండీ. మరి కొన్ని చోట్ల 'బెంగుళూరు సొరకాయ' అని కూడా పిలుస్తారేమో. అయితే మీ హెచ్చరిక గుర్తుంచుకుని, ఈసారి సాంబారులో వేసి చూస్తానండి.
ధన్యవాదాలు.
I think deenni seemavankaayaa ani kudaa antaaruu .deento majjiga pulusu kudaa chestaaru . Chala baaguntundi.
ఈ కాయ తొక్కు తీయకపోయినా బాగానే ఉంటుందండీ..మన బీరకయర కూర చేసినట్లు కూడా చెయ్యొచ్చు.
@కృష్ణుడు: ఓ.."సీమ వంకాయ" మరో పేరన్నమాట...మజ్జిగపులుసులొ ఆనపకాయలు వేసినట్ళు ఉంటుందేమోనండీ అయితే.
ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: అయితే బాగా కడగాల్సి ఉంటుంది. కాని తొక్క తియకపోయేట్టయితే కాయి బాగా లేతగా ఉండాలేమోనండీ.
ధన్యవాదాలు.