దబ్బకాయ !! పేరులోనే గొప్ప ఫీల్ ఉంది కదా. మంచి పసుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది దబ్బకాయ. అందుకే మనుషుల రంగును చెప్పేప్పుడు "పచ్చగా దబ్బపండు ఛాయలో.." అని అంటూంటారు. దబ్బకాయతో పప్పు, పులిహోర, ఊరగాయ మొదలైనవి చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి. జ్వరం వచ్చి తగ్గాకా ఆ చప్ప నోటికి అంత దబ్బకాయ అన్నం రుచి చూపిస్తే...లాలాజలం ఊరుతుంది. దబ్బ ఆకులు వేసవికాలం మజ్జిగలో వేసుకుని తాగితే ఆ మజ్జిగ రుచి అద్భుతం. మా కాకినాడ ఇంట్లో పనసచెట్టు తో పాటూ దబ్బచెట్టు కూడా ఉండేది. బోలెడు కాయలు కాసేది. పనసకాయలతో పాటూ దబ్బకాయలు, దబ్బ ఆకులు కూడా మాతో విజయవాడ వస్తూండేవి. చాలా మంది ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు కొట్టించెయ్యమని అనేవారు కాని మేము కొట్టించలేదు. ఎందువల్లో మేం స్కూల్లో ఉన్న రోజుల్లోనే ఆ దబ్బచెట్టు చచ్చిపోయింది..:((
సిటీల్లో దబ్బకాయలు అరుదుగా దొరుకుతాయి. ఆంధ్రాకి వచ్చాకా ఎక్కడా దొరకలేదు కానీ బొంబాయిలో ఓ షాపులో ప్రియా పచ్చళ్ళ వారి "Citron pickle"(దబ్బకాయఊరగాయ) దొరికేది మాకు. ఇప్పుడు వాటి సీజన్ అనుకుంటా క్రితం వారం మర్కెట్లో దొరికాయి. కాస్త రంగు తేలేదాకా ఆగి ఒక కాయతో పులిహోర, పప్పు చేసి, మరో కాయతో మొన్న ఊరగాయ పెట్టాను. ఇదే మొదటిసారి నేను పెట్టడం. ముక్కలింకా ఊరకపొయినా నిన్ననే వచ్చిన గెస్ట్ లకి భోజనంలో వడ్డించి బాగుందనిపించుకున్నా...:))
ఊరగాయ చేసే పధ్ధతి:
* ముందుగా ముక్కలు తరిగి ఉప్పు, కాస్త పసుపు వేసి కలిపి ఓ పూట ఎండలో పెట్టాలి. ఇలా
* తర్వాత ఒక చిన్న గ్లాసుడు (సుమారు వంద గ్రాములు) నూనె మూకుడులో పోసి పొయ్యిమీద కాగనివ్వలి. కాగిన నూనెలో పావు చెంచా ఇంగువ వేసి ఇంగువ నూనె కాగ నివ్వాలి.
* కాగిన ఇంగువ నూనెలో 125 gms ఎండు మిరపకాయ కారం వేసి నల్లబడకుండా వేగగానే స్టౌ ఆపేయాలి.
* మిక్సీ చేసుకున్న మెంతి పిండి, ఆవ పిండి, 125 gms ఉప్పు, ఒక పెద్ద చెంచా పసుపు పొయ్యి మీది కరమ్ ఉన్న మూకుడులో వేసి బాగా కలపాలి.
* ముక్కలు తరిగేప్పుడు బాగా పండిన దబ్బకాయలైతే రసం కారుతుంది. అది కూడా ఓ గిన్నెలో పోసి అట్టేపెట్టుకోవాలి. ఈ రసాన్ని ఇప్పుడు ఊరగాయ కలిపేప్పుడు అందులో పోసేయాలి.
* ఎండలో పెట్టిన దబ్బకాయ ముక్కలు (పొద్దుట ఎండలో పెట్టి సాయంత్రమో, మధ్యాన్నమో తీసేయచ్చు) పైన చేసుకున్న పిండిలో వేసి మళ్ళి స్టౌ వెలిగించి ఓ ఐదు నిమిషాలు కలుపుతు ఉంచాలి. దీన్ని మా ఇంట్లో పొక్కించటం అంటారు. (వేరే పేర్లు ఉన్నాయేమో తెలీదు).
* మర్నాడు ఊరగాయలో ఊట ఎక్కువ రాకపోతే కాస్తంత నూనె పోసుకోవచ్చు. ఓ వారమైతే ముక్కలు బాగా ఊరి తినటానికి బాగుంటాయి. ఊరగాయ పెట్టిన మర్నాడు ముక్కలు రాకుండా పిండి వేసుకుని తినేయచ్చు. రుచి.... తిని చూడాల్సిందే !!
నేను ఆవపిండి కలపనండీ!ఉప్పు కలిపి ఊరాక కారం, మెంతి పిండి కలిపి, ఇంగువ పోపు పెట్టేస్తానంతే! మా అమ్మ వాళ్ళింట్లో పక్కనే ఉన్న స్థలం లో ఉండేది దబ్బ చెట్టు! వేసవిలో దబ్బాకులు వేసిన మజ్జిగ స్పెషల్ ఐటం మా ఇంట్లో! అయితే ఏడాది క్రితం మా నాన్నగారూ ఆ స్థలం అమ్మేయడంతో, కొనుక్కున్న వాళ్ళు చెట్టు కొట్టేసి ఇల్లు కట్టారు.
ఈ మధ్య కుకట్ పల్లి రైతు బజార్ వద్ద బండి మీద అమ్మే వాడు పదహారు పండ్లు తీసుకోమని, పదహారు ఫలాల నోము కి వాయినం ఇచ్చుకోమని బలవంతం చేశాడు. "ఓరి నీ దుంప తెగ! నేను నోమే పట్టలేదు, ఒదులు నన్ను!" అని ఆరు కాయలు తీసుకుని ఆ బండబ్బాయిని వదిలించుకొచ్చేసరికి చిరాకొచ్చేసింది.
దబ్బకాయ నా ఆల్ టైమ్ ఫేవరిట్!
మీరు ఇలాంటి పోస్ట్ లు లంచ్ టైం లో పెట్టద్దూ అని క్రితం పోస్ట్ లో వార్నిగ్ ఇచ్చా కదండీ. ఇక మీదట ఇలాంటి పోస్ట్ లు పెట్టాలంటే ఉదయం పదకొండూ, పన్నెండు లోపుగా లేకపోతే సాయంత్రం నాలుగు దాటిన తర్వాత పెట్టండి. ఈ పోస్ట్ లో కూడా "కాకినాడ" ని గుర్తుతెచ్చుకున్నారు కాబట్టి ఇది మీ మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాం. :))
మా ఇంట్లో చెట్టుంది లెండి. ఈ సంవత్సరం ఇప్పటి దాకా ఒక 100 దబ్బకాయలు పంచిపెట్టాము. 10 కాయలు ఊరగాయ పెట్టాము 2 - 3 సార్లు పప్పులోకి పులిహారకి వాడాము. ఇంకా ఉన్నాయి. చుట్టాలకోసం ఉప్పులోపోసి ఉంచాలి.
ఊరగాయలు ఏ రకమైనా ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే బూజు పట్టేస్తున్నాయి. వాటి కంటే అప్పడాలు, ఒడియాలు నయం.
దబ్బకాయ -- ఈ పదానికే నోట్లో లాలాజలం అలా ఊరిపోతుంది..త్రుష్ణ గారు మీరు కారం తక్కువ వేస్తారా పచ్చడి కలర్ ఎర్రగా లేదు?? దబ్బకాయ ముక్క మీద కారాన్ని తొలగించి అన్నంలో నెయ్యి వేస్కొని నంజుకు తింటే అహా నా రాజా..i prefer this way..thanks for the post...
@sujata:ఈసారి పెట్టేప్పుడు కాస్త ఆవపిండి కలిపి చూడండి చాలా బావుంటుంది. కాకినాడలో చెట్టు ఊండటంతో మా ఇంట్లో అండరికీ చాలా ఇష్టం దబ్బకాయ. లక్కీగా మావారి ఫేవొరేట్ కూడా ఇదే.
ఇప్పుడు మా మరదలు వాళ్ళమ్మగారింట్లో ఉండి దబ్బచెట్టు.ఇంకా కాయలు దాకా రాలేదు.చిన్న చెట్టు.అప్పుడప్పుడు దబ్బాకులు తెప్పించుకుంటూ ఉంటాము.
@శంకర్.ఎస్: మాకు కరెంట్ వచ్చేసరికీ ఇదే టైం అవుతోందండి...ఏం చేసేది...:(
@D.venu gopal: మీ ఇంట్లో చెట్టుందా? చక్కగా...అదృష్టవంతులు. ముక్కలు ఉప్పులో వేసి స్టోర్ చేయవచ్చా? బాగుంటాయాండీ? ఎక్కువకాలం నిలవ ఉంచవచ్చా?
@ప్రవీణ్ శర్మ:తక్కువ మోతాదులో + తడి తగలకుండా ఊరగాయలు పెట్టుకుంటే ఎప్పుడూ పాడవవండి. నాకెప్పుడూ పాడవలేదు.
@nymish: కారాలు కంపెనీని బట్టి రంగుమారతూంటాయి. నేనీసారి కొన్నది పెద్దగా రంగు లేదు...పైగా మాగాయ లాగ పొయ్యిమీద వెడినూనెలో కారం వేస్తే రంగు మారిపోతుందండి.