మా కాకినాడ ఇంట్లో పేద్ద పనసచెట్టు ఉండేది. నిండా కాయలు, పిందెలతో చెట్టు కళకళాలాడుతూ ఉండేది. కాయ పండితే వంద తక్కువకాకుండా పనసతొనలు వచ్చేవి. అంత పెద్ద పెద్ద కాయలు కాసేది చెట్టు. విచిత్రం ఏంటంటే నాకు పనసతొనలు నచ్చేవి కాదు. వాటి వాసన కూడా గిట్టదు ఇప్పటికీ. కానీ పనసపొట్టు కూర మాత్రం తినేదాన్ని. మేం కాకినాడ నుండి విజయవాడ వచ్చేప్పుడల్లా చిన్న చిన్న కాయలు ఐదారు ఓ సంచీతో ఇచ్చేది మా నాన్నమ్మ. సామానుతో పాటూ ఈ సంచీ కూడా విజయవాడ వచ్చాకా కొందరికి మొత్తం కాయ, కొందరికి కొట్టిన పనసపొట్టూ పంచేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పనసపొట్టు కొన్నప్పుడల్లా అవన్నీ గుర్తుకువస్తాయి.
చౌపాల్, రిలయన్స్, ఫ్రెష్ ఎట్ మొదలైన కూరలషాపుల్లో కొట్టిన పనసపొట్టు అమ్ముతారు. వీటిలో ఎక్కువ నిలవ ఉండటానికి ఉప్పు ఎక్కువ వేసేస్తారు కాబట్టి వండే ముందు రెండు మూడు సార్లు కడుక్కోవలసి ఉంటుంది. అలాకాకుండా బజార్లలో అరటిదూట, అరటి పూవ్వులు అమ్మేవాళ్ళు అమ్మే పనసపొట్టు ఫ్రెష్ గా ఉంటుంది. అందులో ఉప్పు ఉండదు. కానీ ఇలా అమ్మే చోట్లు చాలా అరుదుగా ఉంటుంటాయి. మొన్న అరటిదూట కొనటానికి వేళ్తే ఫ్రెష్ పనసపొట్టు దొరికింది. బాగానే కొట్టాడు. ఈ పనసపొట్టును సన్నగా కొట్టడం అనేది ఒక అద్భుతమైన కళ. కూర వండటం కూడా..:)
సరే ఇక ఆవ పెట్టిన పనసపొట్టు కూర చేసేసుకుందామా? ముందర బజార్లో కొన్న పనసపొట్టు ఒక్కసారి గబుక్కున కడిగేసుకుని వార్చేసుకోవాలి.
విడిగా ఉడకపెట్టేట్లయితే కాసిన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వస్తే చాలు. కొన్న పనసపొట్టులో పసుపు కలిపి అమ్ముతారు కాబట్టి ఇక పసుపు వేయక్కర్లేదు ఉడికేప్పుడు. కాయ దొరికి మనమే కొట్టుకుని వండేప్పుడు అయితే ఉడికేప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఉడికిన పొట్టులో నీళ్ళుంటే ఇలా వార్చేసుకోవాలి. ఉడికిన పనసపొట్టు మరీ ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉండాలి.
కొంతమంది ఉడకపెట్టినతరువాత పోపు వేసేప్పుడు కూడా చింతపండు రసం వేసి కాసేపు పొయ్యిమీద మగ్గిస్తారు. అప్పుడు పోపు ఫ్రెష్నెస్ పోతుందని నేను ఉడికించేప్పుడే చింతపండు రసం వేసేస్తాను. చివరగా పోపులో వేస్తాను.
ఒక మూకుడులో మూడు చెంచాల నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 3 పచ్చి మిర్చి, కర్వేపాకు, కాస్త ఇంగువ వేసి పోపు పెట్టేసుకోవాలి. పొపులో చివరిగా 6,7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వద్దనుకుంటే కాసిని వేరుశనగగుళ్ళు కూడా వేసుకోవచ్చు. వేగిన పోపులో వార్చి పెట్టి ఉంచుకున్న ఉడికిన పనసపొట్టు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత ఆపేసుకోవాలి.
కూర చల్లారాకా పచ్చి ఆవపొడి ఒక ముప్పావు చెంచా(ఇది ఇది సుమారు ఓ పెద్దగ్లాసుడు పనసపొట్టుకు) అందులో వేసి బాగా కలుపుకోవాలి. నోరూరించే పనసపొట్టు కూర రెడీ !!
పనసపొట్టుకూరలోకి చిట్టొడియాలు కాంబినేషన్. (చిన్నగా పెట్టుకునే మినపఒడియాలు). కొన్నిచోట్ల ఈ ఒడియాలు వేయించి కూరలో కలిపేస్తారు కూడా.
అన్నంలోకే కాక, చపాతిల్లోకి కూడా ఈ కూర బావుంటుంది. టెస్టెడ్ & ట్రైడ్ అన్నమాట.
"మా కాకినాడ"
పీ.ప్పీ...డుం డు డుం.. పీ.ప్పీ (కళ్ళలో ఆనంద భాష్పాలతో శంకర్) ఇప్పటికి ఈ పదం ఎన్ని సార్లు చదివానో.....
"ఈ పనసపొట్టును సన్నగా కొట్టడం అనేది ఒక అద్భుతమైన కళ."
నాకీ కళ వచ్చోచ్చ్
"పనసపొట్టుకూరలోకి చిట్టొడియాలు కాంబినేషన్. (చిన్నగా పెట్టుకునే మినపఒడియాలు). కొన్నిచోట్ల ఈ ఒడియాలు వేయించి కూరలో కలిపేస్తారు కూడా."
సాధారణంగా మాఇంట్లో కూడా కూరలోనే కలిపేస్తారండీ
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీకో హెచ్చరిక. ఇంకెప్పుడూ కరెక్ట్ గా లంచ్ టైం లో ఇలాంటి పోస్ట్ లు, పైగా ఫోటోలతో సహా పెట్టకండి.
(వా :((((((((((((((((((((((((((((( )
అవి jack fruit చెట్లు అనుకుంటాను. చిన్నప్పుడు మా మామయ్య గారి ఊరు జగన్నాథపురంలో చూసినట్టు గుర్తుంది.
@శంకర్.ఎస్: :))))))))))))))) నవ్వీ నవ్వీ కళ్లల్లో నీళ్ళు వచ్చాయి. ఏంతైనా మనం మనం కాకినాడ వాళ్ళం కదా ఈసారికి చమించేయండి...! నెక్స్ట్ పోస్ట్ కరెక్ట్ గా మీరు లంచ్ ఎన్నింటికి తింటారో తెలుసుకుని మరీ పెడతాను...:)))
@ప్రవీణ్ శర్మ: పనసకాయను ఇంగ్లీషులో "జాక్ ఫ్రూట్" అంటారండి.
అనాస, పనస అనే రెండు పదాల మధ్య కంఫ్యూజన్ ఉందిలెండి.
నిన్నే ఈ కూర తిన్నాను సూపర్బ్.
ఏమిటా ఈ ఘుమ ఘుమ కోనసీమ వంటకాల సువాసన అని చూస్తే మీ పనసపొట్టు ఆవపెట్టిన కూర కనిపించింది. హన్నా! నాకు పెట్టకుండా తినేస్తారా? ఉంచారా ఏమయినా? అయిపోయిందా?
@ప్రవీణ్ శర్మ: ఓహో...
ధన్యవాదాలు.
@జ్యోతిర్మయి: నిన్ననేనా? మీరు చేసినదా?ఎవరింట్లోనన్నానా?
ధన్యవాదాలు.
@రసజ్ఞ: ఇప్పుడు చెప్పారు కదా...ఈసారి ఉంచుతాలెండి...:)
ధన్యవాదాలు.