కూరలో, ఉప్మాలో కర్వేపాకు వస్తే ఏరి పారేయకుండా తినేవాళ్ళెంత మంది? "పోపులో కర్వేపాకులా ఏరిపారేసారు!" అనే నానుడి కూడా ఉంది..:) చిన్నప్పుడు నేనూ కర్వేపాకు ఏరేసేదాన్ని. కానీ కర్వేపాకులోని ఔషథగుణాలు, ఉపయోగాలు తెలిసాకా ఎప్పుడూ కర్వేపాకును ఏరిపారేయలేదు. ఏ విధంగా కర్వేపాకుని ఎక్కువగా వాడచ్చో కనుక్కుని ఆ విధంగా వాడటం మొదలుపెట్టాను. కర్వేపాకు ఎప్పుడూ తాజాగా ఉన్నది వాడితే ఎక్కువ ఉపయోగకరం.
కర్వేపాకులో ఇనుము, కేల్షియం, ఫోలిక్ ఏసిడ్, ఏంటీఆక్సిడేంట్లు మొదలైనవి ఉన్నాయి. కర్వేపాకు శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించగలదు; జుట్టు పెరిగేలా, తెల్లబడకుండా చెయ్యగలదు; రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించగలదు; జీర్ణ శక్తిని పెంచగలదు.... ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కర్వేపాకు ని గురించి మరిన్ని ఉపయోగాలు ఇక్కడ చూడండి:
http://www.diethealthclub.com/health-food/curry-leaves-health-benefits.html
కర్వేపాకుతో నేను కర్వేపాకుపొడి, కర్వేపాకు పచ్చడి, కర్వేపాకు రైస్ చేస్తుంటాను. ఇవాళ కర్వేపాకుతో పచ్చడి గురించి చెప్తానేం.. మిగిలిన రెండూ మరోసారి.
కావాల్సినవి:
* లేత కర్వేపాకు - రెండు గ్లాసులు (250-300 ml నీళ్ళు పట్టే గ్లాసన్నమాట)
* చిన్న నిమ్మకాయంత నానబెట్టిన చింతపండు
*పోపులోకి : మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఆరు,ఏడు ఎండుమిరపకాయలు
*తగినంత ఉప్పు
* రెండు మూడు చెంచాల నూనె
* మూడు, నాలుగు చెంచాల బెల్లం తురుము- optional (తీపి పచ్చడి కావాలనుకుంటేనే)
తయారీ:
* ముందుగా కర్వేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నీళ్ళు ఓడటం తగ్గితే చాలు.
* రెండు చెంచాల నూనెలో కర్వేపాకు మాడకుండా వేయించాలి.
* పోపు కూడా విడిగా వేయించేసుకోవాలి.
* వేగిన ఆకు చల్లరాకా, కర్వేపాకు + నానబెట్టిన చింతపండు + ఎండు మిరపకాయలు, salt కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
* తీపి కావాలనుకునేవారు కాస్తంత బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
* కర్వేపాకు ముదురుగా ఉంటే పచ్చడి మెత్తగా అవ్వదు. అలాంటప్పుడూ కాస్త గోరువెచ్చని నీళ్ళు గ్రైండ్ చేసేప్పుడు పోసి తిప్పుకుంటే పచ్చడి మెత్తగా అవుతుంది.
*ఈ పచ్చడి అన్నంలోకీ, దోశల్లోకీ కూడా బావుంటుంది.