ఎండాకాలంలో మామూలు ఊరగాయలతో పాటూ ముక్కలు బాగ ఎండుతాయని నిమ్మకాయ, దబ్బకాయ, టమాటా మొదలైన ఊరగాయలు పెట్టుకుంటాము కదా, ఎండ లేకపోయినా కూడా స్టౌ మీద మగ్గించి టమాటా నిలవ పచ్చడి చేసుకోవచ్చు. ఎండబెట్టి పెట్టిన ఊరగాయంత నిలవ ఉండకపోయినా, ఇదీ నెలా రెండునెలలు నిలవ ఉంటుంది.
కావాల్సినవి:
కేజీ టమాటాలు
వంద గ్రాములు నూనె
వంద గ్రాములు చింతపండు
వంద గ్రాములు కారం
ఏభై గ్రాములు మెంతిపొడి(కొన్నది లేక పొడిగా మెంతులు వేయించి గ్రైండ్ చేసినది)
తగినంత ఉప్పు (సుమారు 75-100 gms మధ్య)
చెంచా ఇంగువ
చెంచా పసుపు
పోపుకి చెంచా ఆవాలు
తయారీ:
* టమాటాలు కడిగి పొడిగా ఉండేలా తుడిచి, ముక్కలు చేసి ఏభైగ్రాములు నూనె వేసి వేయించాలి. పైన మూతపెడితే త్వరగా మగ్గుతాయి ముక్కలు.
* ఆ ముక్కలు కాస్త మగ్గాకా, చింతపండు చిన్నచిన్న ముక్కలు చేసి టమాటా ముక్కల్లో వెయ్యాలి. ముక్కలు మెత్తపడి దగ్గర పడుతుండగా మూత తీసేసి, రసం అంతా ఇగరనివ్వాలి.
* రసం అంతా ఇగిరి టమాటా ముక్కలు బాగా దగ్గరపడ్డాకా స్టౌ ఆపేయాలి.
* ఈ మిశ్రమం చల్లారాకా తగినంత ఉప్పు కలిపి గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. మెత్తబడిపోతాయి కాబట్టి ఒక్క తిప్పు చాలు.
* మూకుడులో నాలుగైదు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేయించాలి.
* తర్వాత మెంతిపొడి వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి.
* తర్వాత కారం కూడా వేసి మిగిలిన నూనె కూడా పోసి స్టౌ ఆపేయాలి. కారం వేగటానికి ఆ వేడి చాలు.
* తర్వాత గ్రైండ్ చేసిన టమాటా ముద్ద అందులో కలిపేయాలి. వేడి మీద అదే మూకుడులో కలిపేయచ్చు.
* చల్లారాకా తడి తగలకుండా సీసాలో దాచుకుంటే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.
రెండో రకం టమాటా పచ్చడి:
* పైన చెప్పినట్లుగా మెంతిపొడి, కారం వేగిన మూకుడిలో టమటా ముద్ద కలిపేసాకా, అది చల్లార్చి, అందులో ఓ డభ్భై గ్రాములు పచ్చి ఆవపిండి కలపాలి.
ఊరగాయలాగ అన్నమాట.
* ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేగేప్పుడే వెల్లుల్లి కలిపి వేయించేసి, గ్రైండ్ చెసేస్తే రుచి బావుంటుంది.
* ఇది కూడా తడి తగలకుండా ఉంచితే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.
చదువుతుంటె నొరు ఊరిపొతొంది.So nice.
@siri: ఇంట్లో టమాలుంటే చేసేస్కోండి మరి..:)
ధన్యవాదాలు.
I tried it Trishna garu..it came out well..thanq for ur recipies..
@srujana: thank you.