Pasta in white Sauce without adding cream |
ఓసారి ఓ బఫే లంచ్ కి వెళ్లినప్పుడు అక్కడ 'లైవ్ పాస్తా కౌంటర్' లో 'ఫుల్ క్రీమ్ పాస్తా' టేస్ట్ చూసినప్పటినుండీ అది చెయ్యమని మా అమ్మాయి పేచీ! మ్యాగీ వాళ్ళదో ఎవరిదో రెడీమేడ్ క్రీమీ పాస్తా(టూ మినిట్స్ మ్యాగీ లాంటిది) కొన్నాం కానీ అది బాలేదుట. హోటల్లో చేసినట్లే కావాలని గొడవ. సరే మరి తప్పుతుందా? పాస్తా కొనుక్కొచ్చా. ఆ పాస్తా రకాల్లో నాకన్నింటి కన్నా ఇలాంటివే నచ్చుతాయి.
రెసిపీ గూగులించి మొత్తానికి తయారు చేసా! అమ్మాయికీ, వాళ్ల నాన్నకీ బాగా నచ్చింది. మరి నాలా ఇప్పటిదాకా చెయ్యనివాళ్లెవరైనా ఉంటే ఇలా చేసేసుకోండి..
తయారీ:
* ముందుగా పాస్తా ని బోలెడు నీళ్ళలో.. అంటే ఒక కప్పు పాస్తా అయితే నాలుగు కప్పుల నీళ్లలో ఓ చెంచా ఉప్పు వేసి మరిగించాలి. పాస్తా ఉడికాకా చల్లటి నీళ్లతో వడబోసేసి ఒక చెంచా నునె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉంటుంది పాస్తా.(నూడుల్స్ లాగానే)
* తర్వాత ఓ కేరెట్, కాస్తంత స్వీట్ కార్న్ గింజల్ని కాస్త ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. (కేప్సికమ్, కేబేజ్ సన్నగా తురుముకుని అవి కూడా ఉడికించవచ్చు) ముక్కలు మరీ మెత్తగా ఉడకనఖ్ఖర్లేదు.
* తర్వాత ఓ చెంచా బటర్ లో ఈ కూరముక్కలు 2mins వేయించి పావు చెంచా మిరియాల పొడి వేసి పక్కన పెట్టాలి.
వైట్ సాస్ తయారీ:
* రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, రెండు చెంచాల బటర్ లో( సాల్టెడ్ బటర్ కాకుండా ఫ్రెష్ బటర్ నెయ్యి అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. అదైతే మంచిది. నేను ఇంట్లో చేసిన వెన్న వాడాను.) నల్లబడకుండా రెండు నిమిషాలు వేయించాలి.
* తర్వాత ఒక కప్పుడు పాలు(150gms) అందులో పోసి ఉండలు లేకుండా కలుపుతూ సాస్ చిక్కబడనివ్వాలి. మరీ ముద్దగా ఉంటే కాసిని నీళ్లు కలుపుకోవచ్చు. స్టౌ ఆపే ముందర అర చెంచా సాల్ట్, చిటికెడు పెప్పర్ వేసి బాగా కలపాలి.
* ఈ వైట్ సాస్ మిశ్రమాన్ని చల్లారాకా ఓమాటు వడబోసుకుంటే వైట్ సాస్ క్లియర్ గా ఉంటుంది ఉండలు లేకుండా.
(ఇలా తయారైన సాస్ ను ఫ్రిజ్ లో పెట్టుకుని ఓ వారం లోపూ మరేదైనా కూరలోకి వాడుకోవచ్చు.)
*ఇప్పుడు ఉడికించి ఉంచిన పాస్తా, ఈ వైట్ సాస్, కూరముక్కలు అన్నీ కలిపి ఫ్రైయింగ్ పేన్ లో వేసి, అరచెంచా ఆరిగానో(Oregano) వేసి, ఓ రెండుమూడు నిమిషాలు బాగా కలిపి స్టౌ ఆపేయాలి. ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవాలి.
Oregano పుదీనా జాతికి చెందిన హెర్బ్. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదివరకు పీజ్జా చేసేప్పుడు కొనేదాన్ని నేను. ఆరిగానో లేకపోయినా పర్వాలేదు నాలుగు కొత్తిమీరఆకులు కాస్త సన్నగా తరిగి వేసేస్తే సరిపోతుంది :)
* తయారైన పాస్తాలో ఒక అర కప్పు అముల్ క్రీమ్ కలిపి సర్వ్ చేయండి. Heaven! అంతే!
ఏదైనా సరే భలే చేసేస్తారు మీరు. :)
@sisira: :-)
thanQ :-)