skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

Pan Cake

7:44 PM | Publish by తృష్ణ





ఈ బ్లాగ్ లో పెట్టే ఏ రెసిపి అయినా, ప్రయోగం అయినా నేను వండి రుచి చూసిన తర్వాతే టపాలో రాస్తూంటాను. ఇవాళ బ్లాగ్మిత్రులు జయ గారి కోసం "Pan Cake" రెసిపీ వెతికి నేను మొదటిసారి ప్రయోగం చేసాను. మా పాపకూ నచ్చింది. 

కావాల్సిన పదార్థాలు:

* ఒక కప్పు మైదా
* ఒక egg
* చిటికెడు ఉప్పు
* అర స్పూన్ బేకింగ్ పౌడర్
* చిటికెడు వంట సోడా
* రెండు చెంచాల పంచదార
* అర కప్పు పాలు
* ఒక చెంచా వెన్న 
*కాస్తంత తేనె

తయారీ:
* పొడులన్ని కలిపి ఈ గిన్నెలోకి జల్లించాలి. అప్పుడు అన్నీ బాగా కలుస్తాయన్నమాట.

* అందులో ఒక egg, అరకప్పు పాలు వేసి అన్నీ కలిపి బాగా గిలకొట్టాలి. ఇలా:




* పెనం వేడెక్కాకా వెన్న(బటర్) రాసి అందిపై గరిటెతో పిండి వెయ్యాలి. పెనంపై వేసాకా ఇక పిండి కదపకూడదు.




* వేగాకా రెండో వైపుకి తిప్పాలి.

* కప్పుడు పిండికి మూడు నాలుగు పేన్ కేక్స్ అవుతాయి.

* అవన్నీ తేనె రాసుకుని విడివిడిగా తినచ్చు లేదా ఒకో ఫేన్ కేక్ కీ తేనె రాసుకుంటూ ఒకదానిపై ఒకటి పెట్టి అన్నీ కలిపి కట్ చేసుకుని తినచ్చు. ఇలా..



Labels: experiments, snacks n sweets 9 comments

వేసవి పానీయాలు - 7 (పుదీనా పానీ)

7:18 PM | Publish by తృష్ణ


మార్చి వస్తూనే ఈ ఊళ్ళో ప్రతీ సందు చివర్లోనూ ఓ చక్రాల బండి కనబడుతుంది. బండి మీద పెద్ద కుండకి పుదినా ఆకులు చుట్టి ఉంటాయి. అదే "పుదీనా పానీ". బయట ఎప్పుడూ తాగలేదు. ఏ నీటితో చేస్తారో అని భయం. ఇంట్లో మాత్రం ప్రయత్నించాను. శరీరంలోని అధిక వేడిని తగ్గించే గుణం పుదీనాకి ఉంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. పుదీనా పానీ లో కూడా ఈ రెండు గుణాలు ఉన్నాయి. 



పుదీనా పానీ:

* గుప్పెడు పుదినా ఆకులు
* చిటికెడు బ్లాక్ సాల్ట్
* పావు స్పూన్ జీలకర్ర లేదా జీలకర్ర పొడి
* 200ml నీళ్ళు
* అర చెక్క నిమ్మరసం

* నిమ్మరసం తప్ప పైన చెప్పినవన్ని కలిపి బాగా గ్రైండ్ చేసేయాలి. 
* గ్రైండ్ చేసిన పుదీనా పానీ లో అరచెక్క నిమ్మరసం కలిపి తాగటమే.
* కావాలంటే వడబోసుకోవచ్చు.




ఈ సిరీస్ లో ఆఖరు టపా ఇది :)


Labels: వేసవి పానీయాలు 1 comments

వేసవి పానీయాలు - 6 (మజ్జిగతేటతో..)

3:05 PM | Publish by తృష్ణ


మజ్జిగ బాగా చిలికి లేదా గ్రైండ్ చేసి అందులో బాగా నీళ్ళు పోసి(ఒకవంతు మజ్జిగ, మూడొంతులు నీళ్ళూ) పల్చని మజ్జిగ చేసుకుని అట్టేపెట్టాకా, పైకి తేరిన నీటిని మజ్జిగ తేట అంటాం కదా. వేసవిలో ఆరారా ఈ 'మజ్జిగ తేట' తాగటం అందరం చేస్తూంటాం. ఎండలో బయటకు వెళ్ళే ముందు ఈ మజ్జిగ తేట తాగి వెళితే మంచిది. ఈ మజ్జిగ తేట లో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు లతో పాటూ ఫ్లేవర్ కోసం రకరకాల 'ఆకులు' కూడా కలుపుకు ఉంచితే మంచి సువాసనతో తగటానికి బావుంటుంది.


* దబ్బాకులు:
దబ్బ చెట్టు ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసి మల్చని మజ్జిగలో రాత్రే పడేసి, మర్నాడు ఆ మజ్జిగ తాగితే అద్భుతంగా ఉంటుంది. ఆ ఆకుల ఫ్లేవర్ అంతా మజ్జిగలోకి వస్తుంది. అల్లం మొదలైనవి కలపకపోయినా ఈ ఆకులు ఒక్కటి వేస్తే చాలు. అమ్మావాళ్ళూ చిన్నప్పుడు దబ్బాకులు వేసిన 'తర్వాణీ' తినేవారుట.


* నిమ్మ ఆకులు:
దబ్బచెట్టు ఆకులు దొరకకపోతే నిమ్మ చెట్టు ఆకులు అయినా తుంపి మజ్జిగలో వేసుకుని, మర్నాడు తాగచ్చు.

ఇలా దబ్బాకులు గాని నిమ్మ ఆకులు గాని వేసిన మజ్జిగ రెండు రోజులకన్నా ఉంచితే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ పోతుంది.


* కర్వేపాకు: 
మజ్జిగలో నీళ్ళు, ఉప్పు, కర్వేపాకు, అల్లం, చిన్న పచ్చిమిర్చి ముక్క వేసి గ్రైండ్ చేసుకుని మసాలా మజ్జిగ అని మా అమ్మ ఇస్తూండేది :)




* కొత్తిమీర: 

కర్వేపాకు బదులు కొత్తిమీర ఆకులు వేసి పైన చెప్పినట్లే మజ్జిగ గ్రైండ్ చేసుకోవాలి. రెండిటిలోనూ మామూలు ఉప్పు బదులు black salt వేసుకోవచ్చు.






*మెంతి మజ్జిగ:
ఈ రెసిపి అదివరకు చెప్పాను. వేసవిలో తరచూ మెంతి మజ్జిగ చేసుకుని సాయంత్రాలు లేదా భోజనాల వేళ సూప్ తాగినట్లు తాగచ్చు.
http://ruchi-thetemptation.blogspot.in/2012/11/blog-post_6.html





కీరా దోసతో:
కీరా దోస(bush cucumber) చాలా చలవ చేస్తుంది. వట్టిగా తినటమే కాక చిన్న చిన్న ముక్కలు చేసి మజ్జిగతో కలిపి(200ml మజ్జిగ + ఒక మీడియం కీరా, black salt) గ్రైండ్ చేసుకుని వడబోసుకుని తాగచ్చు.



Labels: వేసవి పానీయాలు 0 comments

వేసవి పానీయాలు - 5 (పచ్చి మామిడి జ్యూస్)

6:22 PM | Publish by తృష్ణ



వేసవిలో ఎండలను తట్టుకునేందుకు ఉపయోగపడే పానియాల్లో పచ్చి మామిడికాయతో చేసే జ్యూస్ ఒకటి. గుజరాతీలు "ఆమ్ పన్నా" అనే పిలుచుకునే ఈ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. ఆ విశేషాలను ఇక్కడ చూడవచ్చు: http://en.wikipedia.org/wiki/Aam_panna



విజయవాడలో ఉండగా(స్కూల్ రోజుల్లో) మా పక్కింటి అమ్మమ్మగారు ఈ జ్యూస్, పచ్చిమామిడి జామ్ రెండూ రుచి చూపించారు. అప్పటి నుండీ పచ్చిమామిడికాయలు మార్కెట్లోకి రాగానే అమ్మ ఈ జ్యూస్, జామ్ రెండూ చేసేది. కాకపోతే ఇందులో పంచదార వేస్తాం కాబట్టి పంచదార తిననివారికి  ఇది ఉపయోగపడదు. అప్పటికప్పుడు చేసుకుని తాగచ్చు లేదా నిలువ ఉండేలా కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చు.

కావాల్సినవి:
ఒక పచ్చిమామిడికాయ
ఒక అరకప్పు పంచదార
చిటికెడు కుంకుమపువ్వు(ఇంట్లో ఉంటేనే)

తయారీ:
* ముందుగా ఒక మామిడికాయ తొక్కు తీసి, ముక్కలు కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
* తర్వాత ఉడికిన మామిడి ముక్కల గుజ్జు, అరకప్పు పంచదార, చిటికెడు కుంకుమపువ్వు, ఇష్టమైతే ఒక ఏలక్కాయ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
* కుంకుమపువ్వు, ఏలక్కాయ బదులు చిటికెడు ఉప్పు(rock salt or black salt), చిటికెడు జీలకర్ర పొడి, పుదీనా ఆకులు కూడా వాడచ్చు.
* గ్రైండ్ చేసిన మిశ్రమానికి తగినన్ని నీళ్ళు కలుపుకుని, వడబోసి గ్లాస్ లో పోసి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయటమే.




జ్యూస్ నిలువ ఉండాలంటే:
* పంచదార పాకం పట్టాలి.
* గ్రైండ్ చేసిన గుజ్జు అందులో పోసి దగ్గర పడుతుండగా స్టౌ ఆపేయాలి.
* ఇది వడబోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మూడునాలుగు రోజులు ఉంటుంది.
* సిట్రిక్ ఏసిడ్ లాంటివి వేస్తే నెల రోజులు నిలవ ఉంటుంది కానీ  మూడు నాలుగు రోజులు ఉండేలాంటిదే బెటర్. అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవటమే మంచిది.
 







Labels: వేసవి పానీయాలు 3 comments

వేసవి పానీయాలు - 4 (చోడిజావ/మజ్జిగ)

11:58 AM | Publish by తృష్ణ





చిరుధాన్యాలన్నింటిలో రాగుల్లో కేల్షియం ఎక్కువ ఉంటుంది. ఏదో ఓ రూపంలో రాగుల్ని నెలకి మూడు సర్వింగ్స్ అయినా ఇస్తే చాలుట పిల్లలకి  అసలు ఏ కేల్షియం టాబ్లెట్లూ వాళ్లకి ఇవ్వక్కర్లేదుట. మొన్న 'మిల్లెట్ ఫెస్ట్' లో చెప్పారు. మొలకెత్తించిన రాగుల పిండి అమ్మారు వాళ్ళు. బజార్లో దొరికే మామూలు రాగిపిండి కన్నా ఇలా మొలకలు వచ్చాకా చేసిన రాగిపిండి ఇంకా బలకరం. ఇలాంటిది కూడా "మన్నా" కంపెనీ వాళ్ళు అనుకుంటా అమ్ముతున్నారు.

రాగులు


నేను బజార్లో కొన్న రాగిపిండి ఫుల్కాల్లోకీ, అట్లలోకీ, పాపకి పూరీల్లోకీ, పకోడీల్లోకీ వాడుతుంటాను. రాగులతో చేసే పదార్థాలను గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు చోడిజావ గురించి చెప్తాను.. రాగులను "చోళ్ళు" అని కూడా అంటారు. మా ఇంట్లో చోళ్ళనేవారు. వాటితో చిన్నప్పుడు మా తాతమ్మగారు "చోడి జావ" అని పెట్టేవారు. చోళ్ళను నీళ్లలో వేసి మరుగించి, ఆ జావ వడబోసి లేదా చోళ్లతో పాటే గ్రైండ్ చేసుకుని తాగేవారు మా తాతమ్మగారు. మాకేమో ఆ జావలో ఉప్పు వేసి, మజ్జిగ కలిపి ఇచ్చేవారు. వేసవికాలమంతా పొద్దుట టిఫిన్ మానేసి ఆవిడ ఈ చోడిజావే తాగేవారు. మేమూ ఇప్పుడు ఎండలు ఎక్కువయ్యాకా రోజూ రాగి మజ్జిగ తాగుతున్నాం. 

* ఇది కాల్షియం నివ్వటమే కాక, శరీరాన్ని చల్లబరుస్తుంది కూడా.
* బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించగలదు.
* కాన్స్టిపేషన్ సమస్యను తగ్గించగలదు.

* రాగుల్లో కేల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్ని స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ వాడకపోవటం మంచిది. డాక్టర్ ని అడిగి తీసుకుంటే మంచిది.



రాగి/చోడి జావ:

* ముందుగా రెండు గ్లాసుల నీటిని(nearly 300ml) మరిగించాలి.
* విడిగా ఒక అరగ్లాసు చల్లని నీళ్లలో  రెండు చెంచాల రాగిపిండి బాగా కలిపి, మరుగుతున్న నీటిలో వేసి గరిటెతో అడుగంటకుండా, ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
* మిశ్రమం దగ్గరపడి, కాస్త జారుగా అయ్యేదాకా ఉంచి స్టౌ ఆపేయాలి. క్రింద ఫోటొలోలాగ.



* జావ చల్లారాకా, సగం గ్లాసు జావకి, సగం పాలు,పంచాదార కలుపుకుని తాగచ్చు.


రాగి మజ్జిగ:



*  జావ చల్లారాకా, సగం గ్లాసు జావకి, సగం గ్లాసు  చిలికిన పల్చటి మజ్జిగ ఉప్పు వేసుకుని తాగవచ్చు.

*పొద్దున్నే చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని రోజంతా రెండుమూడుసార్లు కూడా తాగచ్చు. 

* తాగటానికి అరగంట ముందు బయటకు తీసిపెట్టుకుంటే మంచిది.

* కమ్మని మజ్జిగతో చేస్తే, బాటిల్లో పోసి పిల్లలకి స్కూల్ కి కూడా ఇవ్వవచ్చు.











Labels: వేసవి పానీయాలు 3 comments

వేసవి పానీయాలు - 3 ((సగ్గుజావ)

11:27 PM | Publish by తృష్ణ




సగ్గుబియ్యంతో చేసే ఒడియాలు,పరమాన్నం, హల్వా, కిచిడీ, వడలు మొదలైనవాటి కన్నా సగ్గుబియ్యంతో చేసే "సగ్గుజావ" చాలా మంచిది. సగ్గుజావకు శరీరంలో వేడిని తగ్గించే గుణంతో పాటూ విరోచనాలను తగ్గించే గుణం కూడా ఉంది.


క్రింద బొమ్మలోనిది పెండలం మొక్క. ఈ మొక్క తాలూకూ వేరులే పెండలం దుంపలు. (చిలకడ దుంపల్లాగ). ముదురు గోధుమరంగులో సన్నగా పొడుగ్గా ఉంటాయి. వాటిల్లోంచి సగ్గుబియ్యం   తయారు చేస్తారు. పెండలం(tapioca) నుంచి తయారుచేయబడిన సగ్గుబియ్యాన్ని tapioca pearls అంటారు.




సగ్గుజావ తయారీ:

* ఒక గిన్నెలో టీ గ్లాసు సగ్గుబియ్యంకి
* నాలుగు టీ గ్లాసుల నీళ్ళు పోసి మూత పెట్టి కుక్కర్లో పెట్టాలి.
* మూడు నాలుగు విజిల్స్ వచ్చాకా ఆపేయాలి.
* ఇలా ఉడికిన సగ్గుబియ్యం మెత్తం పూస కనబడకుండా జారుగా అయిపోతుంది. 
* దానిని అలానే లేదా మజ్జిగ పోసుకుని ఉప్పు వేసుకుని తాగచ్చు.
* ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమం, పల్చని మజ్జిగ ఉప్పు వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని రెండురోజులపాటు తాగవచ్చు.
* తీపి కావాలంటే మజ్జిగ వెయ్యకుండా, ఆ మిశ్రమంలో ఉప్పు బదులు పంచదార కలుపుకోవచ్చు.

* కుక్కర్లో కాక విడిగా పొయ్యి మీదే ఓపెన్ గా సగ్గుబియ్యం ఉడికించాలంటే ఒకటికి ఐదు గ్లాసుల నీళ్ళు పొయ్యాలి.

పిల్లలు ఇష్టంగా తినాలంటే,
*మరీ జారుగా కాకుండా నాలుగుకి బదులు రెండు గ్లాసుల నీళ్ళే పోసి ఉడికిస్తే సగ్గుబియ్యం పూసలు అలానే కనబడుతూ ఉడుకుతాయి. అందులో కాస్త నెయ్యి వేసి, పంచదార వేసి ఇస్తే పిల్లలకు నచ్చవచ్చు. పాలు,జీడిపప్పు వేసిన సగ్గుబియ్యం పరమాన్నం కన్నా మా పాప దీన్నే ఎంతో ఇష్టంగా తింటుంది. 

 * సగ్గుబియ్యంలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ కాన్షియస్ వాళ్ళకు, డయాబెటిక్ పేషంట్స్ కు మంచిది కాదు.


Labels: వేసవి పానీయాలు 0 comments

వేసవి పానీయాలు - 2 (బార్లీ నీళ్ళు)

10:14 PM | Publish by తృష్ణ






బార్లీ గింజలు తెలుసు కానీ వాటివల్ల లెఖ్ఖపెట్టలేనన్ని ఉపయోగాలు ఉన్నాయని నేను వాటిని వాడటం మొదలుపెట్టేవరకు నాకు తెలీదు.
చిన్నప్పుడు వేసవికాలం లో బార్లో నీళ్ళలో మజ్జిగ కలిపి ఇచ్చేది అమ్మ. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మంచిది అంటే తాగేదాన్ని. ఆ తరువాత నెట్లో వివరాలు వెతికితే ఎన్నో సంగతులు తెలిసాయి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బార్లీ వాడేవారని. వయసు పెరిగే కొద్దీ శరీరంపై వచ్చే ముడతలు తగ్గించగలిగే గుణం ఉందిట బార్లీకి! 


ముఖ్యంగా వేసవిలో దాహం తగ్గటానికి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఒకవేళ ఉంటే తగ్గటానికీ బార్లీ నీరు వాడతారు. కొన్ని రకాల కిడ్నీ సమస్యలను కూడా బార్లి నీరు తగ్గించగలదట.

శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్న బార్లీని కొన్ని వేడి ప్రదేశాల్లో అన్నంలా కూడా తింటారు. సూప్స్ చిక్కగా అవ్వటానికి కూడా బార్లీ వాడతారు. తక్కువ ధరలో బజార్లో అన్ని దుకాణాల్లో,సూపర్ మార్కెట్లలో బార్లీ గింజలు దొరకుతాయి. బార్లీ పొడి కూడా కొన్ని సూపర్ మార్కెట్లలో చూసాను నేను.

బార్లీ నీళ్ళు ఎలా చేసుకోవాలంటే:

* ఒక లీటర్ మంచినీళ్ళకి 
* పావు గ్లాసు బార్లీ గింజలు కలిపి 
* గిన్నెలో పోసిన లీటర్ నీళ్ళు ముప్పావు లీటర్ అయ్యేదాకా బాగా మరిగించాలి. అంటే పావు వంతు నీళ్ళు ఇగిరిపోవాలన్నమాట. బార్లీ నీళ్ళు ఇంకా చిక్కగా కావాలంటే సగం నీళ్ళు అయ్యేదాకా కూడా మరిగించాలి.

* అలా మరిగిన బార్లి నీళ్ళు కాస్త ఎర్రబడినట్లుగా, కాస్త చిక్కగా కనిపిస్తాయి.

ఇలా తయారు చేసుకున్న బార్లీ నీళ్ళు రోజూ గ్లాసుడు తాగితే ఎంతో ఆరోగ్యకరం.

అలా మరిగిన బార్లీ నీళ్లలో.. 
* ఉప్పు కలుపుని లేదా కలపకుండా అలానే తాగవచ్చు.

* గ్లాసుడు నీళ్లలో ఒక చెక్క నిమ్మరసం కలపుకుని తాగవచ్చు.

* సగం బార్లీ నీళ్ళు, సగం మజ్జిగ కలిపి తాగచ్చు.

* కమలా లేదా పుచ్చకాయ జ్యూస్ లో కలుపుకుని తాగచ్చు.


బార్లీ గురించి నేను తెలుసుకున్న కొన్ని ఉపయోగాలు :

* ఆకలిని పెంచే గుణం ఉంది.

* కడుపులో మంటను తగ్గిస్తుంది.

* రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించగలదు. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవాళ్లకు ఇది చాలా మంచిదని చెప్తారు.

* చాలావరకూ కిడ్నీ సమస్యలను దూరం చెయ్యగలదు.

* గాల్ బ్లాడర్ లో, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేయగలదు.

* రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించగలదు. 

* దగ్గు, ఆయాసాలను కూడా తగ్గించగలదు.


ఒకోసారి పొరపాట్లు కూడా మంచికే జరుగుతాయి. ఒకసారి పొరపాటున మినపప్పు డబ్బాలో బార్లీ గింజలు పోసేసాను. చాలామటుకు ఏరగలిగినన్ని ఏరి మిగిలిన దాంట్లో(అంటే మినపప్పు,బార్లీ కలిపిన దాంట్లో) బియ్యం కలిపి నానబెట్టేసి దోసలు వేసేసాను. తర్వత నెట్లో వెతికితే అలా దోశలపిండిలో బార్లీ గింజలు కలిపిన రెసిపీ ఒకటి కనబడింది :-)



Labels: వేసవి పానీయాలు 5 comments

వేసవి పానీయాలు - 1 (సబ్జా గింజల నీరు)

6:14 PM | Publish by తృష్ణ


 నానిన సబ్జా గింజలు



వేసవిలో ఒంట్లో పెరిగే వేడిని తగ్గించుకుందుకు చాలా రకాల పానీయాలు ఉన్నాయి. వాటిల్లో నాకు తెలిసిన కొన్నింటిని  ఈ సిరీస్ లో రాయాలని సంకల్పం. మా ఇంట్లో చిన్నప్పటి నుండీ వాడుతున్న కొన్నింటి గురించి రాస్తాను. ఎవరైనా తెలీనివాళ్ళకి ఉపయోగపడతాయి.

మొదటిగా సబ్జా  గింజల గురించి... 





సబ్జా గింజల్ని  ఆంగ్లంలో "బేసిల్ సీడ్స్" అంటారు. బేసిల్ తులసి మొక్కలాంటిదే. ఒకటే జాతి. ఆకులు వేరుగా ఉంటాయి. వీటి గింజలను రకరకాలుగా వాడతారు. కూల్డ్రింక్స్ లో, ఐస్క్రీంస్ లో, "ఫలూదా" అనే ప్రఖ్యాత డ్రింక్ లో.. ఇలాగన్నమాట. సబ్జా గింజల  ముఖ్య గుణం శరీరంలో వేడిని తగ్గించటం. బజార్లో చాలా చోట్ల తక్కువ ధరలో ఈ గింజలు మనకు లభ్యమౌతాయి.


సబ్జా గింజల నీరు + జూస్ :

* ఒక చెంచా సబ్జా గింజలను ఒక పెద్దగ్లాసుడు నీళ్ళలో(200 ml) వేసి ఓ మూడు గంటలు వదిలేయాలి. తరువాత ఆ నీటిని వడబోసుకుని తాగటమే. నానిన గింజలను కాసిని తినవచ్చు కూడా. కావాలంటే పంచదార వేసుకుని మరీ తినచ్చు. ఖస్ ఖస్ మంటూ సరదాగా భలే ఉంటాయి నమలటానికి :-)

*రాత్రి నానబెట్టి పొద్దున్నే వడబోసుకుని ఆ నీళ్ళు తాగచ్చు కూడా.

* ఈ సబ్జా గింజల నీటిని కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగవచ్చు.

* పుచ్చకాయ ముక్కలతో గానీ వేరే ఏదైన ఫ్రూట్ జ్యూస్ చేసేప్పుడు ఈ నీటిని అందులో కలిపి తాగవచ్చు.

* వీటివల్ల మిగతా ఉపయోగాలు ఎలా ఉన్నా, వేసవిలో శరీరాన్ని చల్లబరచటానికి, అన్నికాలాల్లోనూ వేడి శరీరాలు గలవారికీ సబ్జా గింజలు నానబెట్టిన నీరు చాలా మేలు చేస్తుంది.


Labels: వేసవి పానీయాలు 6 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ▼  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ▼  April (8)
      • Pan Cake
      • వేసవి పానీయాలు - 7 (పుదీనా పానీ)
      • వేసవి పానీయాలు - 6 (మజ్జిగతేటతో..)
      • వేసవి పానీయాలు - 5 (పచ్చి మామిడి జ్యూస్)
      • వేసవి పానీయాలు - 4 (చోడిజావ/మజ్జిగ)
      • వేసవి పానీయాలు - 3 ((సగ్గుజావ)
      • వేసవి పానీయాలు - 2 (బార్లీ నీళ్ళు)
      • వేసవి పానీయాలు - 1 (సబ్జా గింజల నీరు)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.