సగ్గుబియ్యంతో చేసే ఒడియాలు,పరమాన్నం, హల్వా, కిచిడీ, వడలు మొదలైనవాటి కన్నా సగ్గుబియ్యంతో చేసే "సగ్గుజావ" చాలా మంచిది. సగ్గుజావకు శరీరంలో వేడిని తగ్గించే గుణంతో పాటూ విరోచనాలను తగ్గించే గుణం కూడా ఉంది.
క్రింద బొమ్మలోనిది పెండలం మొక్క. ఈ మొక్క తాలూకూ వేరులే పెండలం దుంపలు. (చిలకడ దుంపల్లాగ). ముదురు గోధుమరంగులో సన్నగా పొడుగ్గా ఉంటాయి. వాటిల్లోంచి సగ్గుబియ్యం తయారు చేస్తారు. పెండలం(tapioca) నుంచి తయారుచేయబడిన సగ్గుబియ్యాన్ని tapioca pearls అంటారు.
సగ్గుజావ తయారీ:
* ఒక గిన్నెలో టీ గ్లాసు సగ్గుబియ్యంకి
* నాలుగు టీ గ్లాసుల నీళ్ళు పోసి మూత పెట్టి కుక్కర్లో పెట్టాలి.
* మూడు నాలుగు విజిల్స్ వచ్చాకా ఆపేయాలి.
* ఇలా ఉడికిన సగ్గుబియ్యం మెత్తం పూస కనబడకుండా జారుగా అయిపోతుంది.
* దానిని అలానే లేదా మజ్జిగ పోసుకుని ఉప్పు వేసుకుని తాగచ్చు.
* ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమం, పల్చని మజ్జిగ ఉప్పు వేసి కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని రెండురోజులపాటు తాగవచ్చు.
* తీపి కావాలంటే మజ్జిగ వెయ్యకుండా, ఆ మిశ్రమంలో ఉప్పు బదులు పంచదార కలుపుకోవచ్చు.
* కుక్కర్లో కాక విడిగా పొయ్యి మీదే ఓపెన్ గా సగ్గుబియ్యం ఉడికించాలంటే ఒకటికి ఐదు గ్లాసుల నీళ్ళు పొయ్యాలి.
పిల్లలు ఇష్టంగా తినాలంటే,
*మరీ జారుగా కాకుండా నాలుగుకి బదులు రెండు గ్లాసుల నీళ్ళే పోసి ఉడికిస్తే సగ్గుబియ్యం పూసలు అలానే కనబడుతూ ఉడుకుతాయి. అందులో కాస్త నెయ్యి వేసి, పంచదార వేసి ఇస్తే పిల్లలకు నచ్చవచ్చు. పాలు,జీడిపప్పు వేసిన సగ్గుబియ్యం పరమాన్నం కన్నా మా పాప దీన్నే ఎంతో ఇష్టంగా తింటుంది.
* సగ్గుబియ్యంలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ కాన్షియస్ వాళ్ళకు, డయాబెటిక్ పేషంట్స్ కు మంచిది కాదు.
Post a Comment