వేసవిలో ఎండలను తట్టుకునేందుకు ఉపయోగపడే పానియాల్లో పచ్చి మామిడికాయతో చేసే జ్యూస్ ఒకటి. గుజరాతీలు "ఆమ్ పన్నా" అనే పిలుచుకునే ఈ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైనది. ఆ విశేషాలను ఇక్కడ చూడవచ్చు: http://en.wikipedia.org/wiki/Aam_panna
విజయవాడలో ఉండగా(స్కూల్ రోజుల్లో) మా పక్కింటి అమ్మమ్మగారు ఈ జ్యూస్, పచ్చిమామిడి జామ్ రెండూ రుచి చూపించారు. అప్పటి నుండీ పచ్చిమామిడికాయలు మార్కెట్లోకి రాగానే అమ్మ ఈ జ్యూస్, జామ్ రెండూ చేసేది. కాకపోతే ఇందులో పంచదార వేస్తాం కాబట్టి పంచదార తిననివారికి ఇది ఉపయోగపడదు. అప్పటికప్పుడు చేసుకుని తాగచ్చు లేదా నిలువ ఉండేలా కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చు.
కావాల్సినవి:
ఒక పచ్చిమామిడికాయ
ఒక అరకప్పు పంచదార
చిటికెడు కుంకుమపువ్వు(ఇంట్లో ఉంటేనే)
తయారీ:
* ముందుగా ఒక మామిడికాయ తొక్కు తీసి, ముక్కలు కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
* తర్వాత ఉడికిన మామిడి ముక్కల గుజ్జు, అరకప్పు పంచదార, చిటికెడు కుంకుమపువ్వు, ఇష్టమైతే ఒక ఏలక్కాయ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
* కుంకుమపువ్వు, ఏలక్కాయ బదులు చిటికెడు ఉప్పు(rock salt or black salt), చిటికెడు జీలకర్ర పొడి, పుదీనా ఆకులు కూడా వాడచ్చు.
* గ్రైండ్ చేసిన మిశ్రమానికి తగినన్ని నీళ్ళు కలుపుకుని, వడబోసి గ్లాస్ లో పోసి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయటమే.
జ్యూస్ నిలువ ఉండాలంటే:
* పంచదార పాకం పట్టాలి.
* గ్రైండ్ చేసిన గుజ్జు అందులో పోసి దగ్గర పడుతుండగా స్టౌ ఆపేయాలి.
* ఇది వడబోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మూడునాలుగు రోజులు ఉంటుంది.
* సిట్రిక్ ఏసిడ్ లాంటివి వేస్తే నెల రోజులు నిలవ ఉంటుంది కానీ మూడు నాలుగు రోజులు ఉండేలాంటిదే బెటర్. అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవటమే మంచిది.
చిన్నప్పుడెప్పుడో ఈ ఆంపన్నా తాగేవాళ్ళం.మా పిల్లలికి సయించేదికాదు.కానీ ఇందులో బెల్లం వాడేవారని గుర్తు.ఏదైతేనేమి,వొంటికి చాలా మంచిది.
తృష్ణ గారూ.. మీ ఈ వంటల బ్లాగ్ ఎంత బావుందంటే, రోజు ఏదో ఒక టైం లో లాగ్ఇన్ అయి ఈ రోజేం వండుదామబ్బా అని చూసుకుంటున్నాను. చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటోంది.. అందుకే మీకు థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
@indira: అవును కొందరు బెల్లం కూడా వేసుకుంటారని విన్నానండి.
thank you :)
@priya: thanks a lot :)