బార్లీ గింజలు తెలుసు కానీ వాటివల్ల లెఖ్ఖపెట్టలేనన్ని ఉపయోగాలు ఉన్నాయని నేను వాటిని వాడటం మొదలుపెట్టేవరకు నాకు తెలీదు.
చిన్నప్పుడు వేసవికాలం లో బార్లో నీళ్ళలో మజ్జిగ కలిపి ఇచ్చేది అమ్మ. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మంచిది అంటే తాగేదాన్ని. ఆ తరువాత నెట్లో వివరాలు వెతికితే ఎన్నో సంగతులు తెలిసాయి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బార్లీ వాడేవారని. వయసు పెరిగే కొద్దీ శరీరంపై వచ్చే ముడతలు తగ్గించగలిగే గుణం ఉందిట బార్లీకి!
ముఖ్యంగా వేసవిలో దాహం తగ్గటానికి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఒకవేళ ఉంటే తగ్గటానికీ బార్లీ నీరు వాడతారు. కొన్ని రకాల కిడ్నీ సమస్యలను కూడా బార్లి నీరు తగ్గించగలదట.
శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్న బార్లీని కొన్ని వేడి ప్రదేశాల్లో అన్నంలా కూడా తింటారు. సూప్స్ చిక్కగా అవ్వటానికి కూడా బార్లీ వాడతారు. తక్కువ ధరలో బజార్లో అన్ని దుకాణాల్లో,సూపర్ మార్కెట్లలో బార్లీ గింజలు దొరకుతాయి. బార్లీ పొడి కూడా కొన్ని సూపర్ మార్కెట్లలో చూసాను నేను.
బార్లీ నీళ్ళు ఎలా చేసుకోవాలంటే:
* ఒక లీటర్ మంచినీళ్ళకి
* పావు గ్లాసు బార్లీ గింజలు కలిపి
* గిన్నెలో పోసిన లీటర్ నీళ్ళు ముప్పావు లీటర్ అయ్యేదాకా బాగా మరిగించాలి. అంటే పావు వంతు నీళ్ళు ఇగిరిపోవాలన్నమాట. బార్లీ నీళ్ళు ఇంకా చిక్కగా కావాలంటే సగం నీళ్ళు అయ్యేదాకా కూడా మరిగించాలి.
* అలా మరిగిన బార్లి నీళ్ళు కాస్త ఎర్రబడినట్లుగా, కాస్త చిక్కగా కనిపిస్తాయి.
ఇలా తయారు చేసుకున్న బార్లీ నీళ్ళు రోజూ గ్లాసుడు తాగితే ఎంతో ఆరోగ్యకరం.
అలా మరిగిన బార్లీ నీళ్లలో..
* ఉప్పు కలుపుని లేదా కలపకుండా అలానే తాగవచ్చు.
* గ్లాసుడు నీళ్లలో ఒక చెక్క నిమ్మరసం కలపుకుని తాగవచ్చు.
* సగం బార్లీ నీళ్ళు, సగం మజ్జిగ కలిపి తాగచ్చు.
* కమలా లేదా పుచ్చకాయ జ్యూస్ లో కలుపుకుని తాగచ్చు.
బార్లీ గురించి నేను తెలుసుకున్న కొన్ని ఉపయోగాలు :
* ఆకలిని పెంచే గుణం ఉంది.
* కడుపులో మంటను తగ్గిస్తుంది.
* రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించగలదు. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవాళ్లకు ఇది చాలా మంచిదని చెప్తారు.
* చాలావరకూ కిడ్నీ సమస్యలను దూరం చెయ్యగలదు.
* గాల్ బ్లాడర్ లో, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేయగలదు.
* రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించగలదు.
* దగ్గు, ఆయాసాలను కూడా తగ్గించగలదు.
ఒకోసారి పొరపాట్లు కూడా మంచికే జరుగుతాయి. ఒకసారి పొరపాటున మినపప్పు డబ్బాలో బార్లీ గింజలు పోసేసాను. చాలామటుకు ఏరగలిగినన్ని ఏరి మిగిలిన దాంట్లో(అంటే మినపప్పు,బార్లీ కలిపిన దాంట్లో) బియ్యం కలిపి నానబెట్టేసి దోసలు వేసేసాను. తర్వత నెట్లో వెతికితే అలా దోశలపిండిలో బార్లీ గింజలు కలిపిన రెసిపీ ఒకటి కనబడింది :-)
మేము బార్లిగింజల్ని మర పట్టించి పిండి ని జావ కి వాడతాము. పిండి బాగుంటుంది .తేలికగా అయిపోతుంది .గ్లాసు జావకి రెండు స్పూన్ ల పిండి సరిపోతుంది .
@radhika(nani):మర ఆడించే ఐడియా బావుందండి. బయట కొన్న బార్లీ పిండి కూడా ఓసారి వాడానండి నేను. అదే సులువేమో కానీ నాకు బార్లీ గింజలు మరిగిస్తేనే నచ్చుతుందండి.. thanks for the visit :)
Trishna garu..
mee blog ni regular ga chusthuntanu..chala manchi vishayalu raasthuu untaru..high blood pressure ni thagginchukovadaniki evaina chitakalu telisthe cheppandi..
@srujana gaaru,ఈ బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు. హై బి.పి గురించి ఎక్కువగా తెలీదండి. కానీ కొన్ని పాయింట్లు చెప్పగలను..మీకు తెలిసే ఉంటాయి.. ఉప్పు బాగా తక్కువ తినాలి, ముఖ్యంగా ఊరగాయలు పూర్తిగా మానేయాలి. నూనె తగ్గించాలి, అంటే పోపు కూరలు మాత్రమే తినాలి. బరువు తగ్గాలి, టెంషన్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కష్టమైనవే కానీ "జాన్ హై తో జహాన్ హై" అన్నారు కదండి.. ఆరోగ్యo ముఖ్యం. అందుకోసం ఏదైనా చేయవచ్చు.
I want to use barley flour to drink barley java.ThanQ for ur information.