మార్కెట్ నుండి కూరలు తెచ్చాకా ముందర త్వరగా పాడయిపోయేవీ, పండిపోయే కూరలనీ వండేసుకుంటాం కదా! ఎంత జాగ్రత్తగా ఏరి తెచ్చుకున్నా దొండకాయలు త్వరగా పండిపోతూంటాయి. అలాంటివాటిని పడేయకుండా తీపి కూర వండేసుకోవచ్చు. పండిపోవడం అంటే మరీ ఎర్రగా, మెత్తగా అయిపోయినవి కాక ఆకుపచ్చదనం పోయి కాస్తఎరుపెక్కిన దొండకాయలు ఉంటాయి కదా..అవన్నమాట!! వాటితో కారంపెట్టి కూర చేసినా పుల్లగా ఉంటాయి ముక్కలు. అందుకని మా చిన్నప్పుడు అమ్మ ఇలా తీపి వేసి వండేసేది. 'తియ్యగా' ఉంటే చాలు.. వదలకుండా తినేసేవాళ్ళం..:)
* ముందర తరిగేప్పుడే కాస్త పండిపోయినట్లున్న దొండకాయ ముక్కలు వేరే గున్నెలో వేసుకోవాలి.
* అవి కప్పుడు ముక్కలు ఉంటే అర కప్పు నీళ్ళు, పావు చెంచా ఉప్పు;
రెండు కప్పులు ముక్కలు ఉంటే ఒక కప్పు నీళ్ళు, అర చెంచా ఉప్పు రెండు విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చెయ్యాలి.
సుమారు పావుకేజీ కూరకి:
* మూకుడులో ఒక చెంచా నూనె వేసి అర చెంచా శనగపప్పు, మినపప్పు, పావు చెంచా ఆవాలు, జీలకర్ర వేసి, రెండు ఎండు మిరపకాయలు, రెండు రొబ్బలు కర్వేపాకు, చిటికెడు ఇంగువ,పసుపు వేసి పోపు వేయించాలి.
* ఉడికిన ముక్కలు (నీళ్ళు ఉంటే వాటితో పాటే) పోపులో వేసేయాలి. చిన్న నిమ్మకాయంత బెల్లం తరుగు(తీపి బాగా ఇష్టమతే ఇంకాస్త వేసుకోవచ్చు) అందులో వెయ్యాలి. ఉప్పు మరికాస్త కావలిస్తే కలుపుకోవాలి.
* బెల్లం కరిగి, కూర ముక్కల్లో నీళ్ళు పూర్తిగా ఇగిరే వరకూ మధ్య మధ్య కూర కలుపుతూ ఉండాలి.
* కూరంతా దగ్గరపడి,ఉడికింది అనిపించాకా చివర్లో ఫ్రెష్ కొబ్బరి(ఫ్రెష్ అయితే బెటర్) కానీ, ఎండు కొబ్బరి పొడి గానీ రెండు చెంచాలు వేసి స్టౌ ఆపేయాలి.
* పండిన దొండకాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి కూరలో ఇంక చింతపండు రసం లాంటివేమీ కలపక్కర్లేదు.
* తియ్యతియ్యగా,పుల్లపుల్లగా బావుంటుందీ కూర!
* తీపి వద్దనుకుంటే ఉడకపెట్టిన ముక్కలు పోపులో వేసేసి, కొబ్బరి కోరు వేసి కూడా వండుకోవచ్చు.