skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

జొన్న మొలకల ఉప్మా (Upma with Sprouted jowar)

8:49 AM | Publish by తృష్ణ



నిన్న రాత్రి మొదటిసారి చేసిన ఈ ప్రయోగానికి ఏం పేరు పేట్టాలో అని ఆలోచిస్తే.. 'జొన్న మొలకల ఉప్మా' అనచ్చేమో అనిపించింది.
జొన్నలని(Jowar) ఒకపూటంతా(6,7hrs) నానబెట్టి, నీళ్ళు తీసేసి, రాత్రికి పల్చటి కాటన్ బట్టలో మూట కట్టచ్చు.. లేదా బాగా డ్రైగా చేసేసి ఏదైనా గిన్నె/బాక్స్ లో వేసి మూత పెడితే పొద్దుటికి మొలకలు వచ్చేస్తాయి. పెసలైనా, బొబ్బర్లైనా మొలకెత్తించడానికి ఇదే పధ్ధతి. ఒకవేళ రాత్రికి నానబెడితే పొద్దున్నే డ్రైగా మూట కట్టేస్తే సాయంత్రానికి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. మరనాటిదాకా ఉంచితే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి.

ఇదివరకూ సజ్జలు(Bajra), రాగులు(ragi) మొలకెత్తించి వాడాను కానీ జొన్నలు ఇదే మొలకెత్తించడం. ఏదో ఒక టిఫిన్ + రాగి మజ్జిగ నా రాత్రి భోజనం మెనూ. ఇడ్లీ, దోశలాంటి రొటీన్ టిఫిన్స్ వరుస అయిపోయాకా, రకరకాల కొత్త టిఫిన్ ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను. జొన్నలతో సరదాగా కొత్త రకం ఏదైనా చెద్దామని మనసై మొన్న రాత్రి జొన్నలు నానబెట్టాను. నిన్న పొద్దున్నే నీళ్ళు తీసేసి ఓ గిన్నెలో వేసి మూతపెట్టాను. రాత్రికి మొలకలు వచ్చాయి. 


జొన్న మొలకల ఉప్మా తయారీ:
* ముందర జొన్నలు కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. (జొన్నన్నం ఇలానే వండుతారేమో!) వీటితో సంతోషకరమైనదేమిటంటే ఎక్కువ విజిల్స్ వచ్చినా పేస్ట్ అవ్వవు ఇవి :) సుమారు 100gms జొన్నలకి  300ml నీళ్ళు + తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్ ఓపెన్ చేసాకా జొన్నలతో పాటూ మిగిలి ఉన్న నీళ్ళు పారబొయ్యకుండా ఉంచాలి.

* ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగి, ఉప్మా కి లానే మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, మిర్చి, కర్వేపాకు పోపు వేయించి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. 

*ఎదురుగా అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన fresh green peas కనిపిస్తే అవి ఓ నాలుగు వలిచి ఉల్లిపాయ ముక్కల్లో పడేసా. ఓ కేరెట్ కూడా తరిగి వేసా.(కేరెట్ గ్రేట్ చేసేసుకోవచ్చు.వేయించకపోయినా పర్వాలేదు)

* ఇప్పుడూ ఉడికిన జొన్న మొలకలను ఈ ఉల్లిపాయముక్కల పోపులో పడేయాలి, నీళ్ళతో సహా. ఉప్పు చెక్ చేసి కావాలిస్తే కలిపి, చిటికెడు పసుపు వెయ్యాలి. కాసేపటికి నీళ్ళు ఇగిరిపోతాయి. 

* ఉప్మా దగ్గర పడ్డాకా దింపేసుకుని నాలుగు కొత్తిమీర ఆకులు అలంకరించి, ఒక అరచెక్క నిమ్మరసం పిండేసి తినేయడమే..!


ఈ రెసిపీ కాస్త పళ్ళకి పెద్ద పనే కానీ టేస్టీగా ఉంది.
ఇవాళ పొద్దున్నకి నేను బానే ఉన్నా కాబట్టీ.. కొత్తరకాలు ఇష్టపడేవారు ట్రై చేయచ్చు..:)

టిప్:
ఉప్మాలోకి ఉల్లిపాయలతో పాటూ టమాటా ముక్కలు వాడితే నిమ్మరసం అక్కర్లేదేమో! నే టమాటా వాడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా.

Labels: experiments, pulses, tiffins 2 comments

టమాటా సూప్

4:39 PM | Publish by తృష్ణ



బజార్లో ఇప్పుడు రకరకాల కంపెనీల వారు 1+1ఆఫర్లతో రకరకాల సూప్స్ అమ్ముతున్నారు. చలి కాలం భోజనం తయారయ్యేలోపూ లేదా సాయంత్రాలు వెచ్చవెచ్చగా సూప్ తాగితే బావుంటుంది. కానీ బజార్లో దొరికేవాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు. అవి ఎక్కువగా తినడం మంచిది కాదు. సో, ఇంట్లో మనం స్వయంగా చేసుకున్న సూప్ అయితే అన్నివిధాలా ఆరోగ్యకరం. క్రింద రాసిన పధ్దతిలో టమాటా ఇంకా కార్న్, స్వీట్ కార్న్, మిక్స్డ్ వెజిటబుల్ సూప్స్ చేసుకోవచ్చు.

టమటా సూప్ తయారీ:
* పావు కేజీ టమాటాలు బాగా కడిగి, నాలుగు ముక్కలుగా తరగాలి.

* ఒక మీడియం చెంచా నెయ్యి లేదా బటర్ లో రెండు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక వెల్లుల్లిపాయ వేసి వేగాకా, టమాటా ముక్కలు, ఒక మీడియం కేరెట్(స్వీట్నెస్ కోసం), చిన్న బీట్రూట్ ముక్క(ఇది ఎరుపు రంగు కోసం. కలపకపోయినా పర్లేదు.) కూడా వేసి కాస్త వేయించి, ఒక గ్లాసుడు నీళ్ళు పోసి 5mins మగ్గనివ్వాలి. చిన్న కుక్కర్ లో ప్రెషర్ కుక్ చేసినా సరే. కుక్కర్లో అయితే అయితే అర గ్లాస్ నీళ్ళు చాలు. ఒక్క విజిల్ రాగానే స్టౌ ఆపేయచ్చు.

* ఇప్పుడు టమాటా ముక్కల్లోంచి లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ముక్కలు ఏరి, తీసేయాలి. టమాటాలకి వాటి ఫ్లేవర్ అంటితే చాలు. 

* ఇప్పుడు ఉడికిన ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి, ఆ గుజ్జుని స్ట్రైనర్ లో వేసి వడబోసేయాలి.


* వచ్చిన గుజ్జుకి డబల్ ఎమౌంట్ నీళ్ళు కలిపి, తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి.

* ఐదు నిమిషాల్లో మిశ్రమమంతా మరుగుకి వస్తుంది. అప్పుడు ఒక రెండు చెంచాలు కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) విడిగా అరగ్లాసు నీళ్ళల్లో కలిపి, మరుగుతున్న టమాటా గుజ్జు నీళ్ళల్లో కలపాలి.  ఇది సూప్ ని స్టిక్కీగా చేసి, దగ్గర చేస్తుంది.

* ఇంకా తీపి కావాలంటే ఒక చెంచా పంచదార కలుపుకోవచ్చు.

* మరుగుతున్న soupలో అర స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి.

* సర్వ్ చేసే ముందు తరిగిన కొత్తిమీర, rusk ముక్కలు వేసి ఇస్తే రుచిగా సూప్ ఉంటుంది.

(ఇందులో కేరెట్/బీట్రూట్ ఏమీ కలపలేదు. ప్లైన్ టమాటా సూప్)

టిప్:
బ్రెడ్ ముక్కలు వేయించి కలపచ్చు కానీ అది మళ్ళీ మరో పని + బ్రెడ్ త్వరగా మెత్తపడిపోతుంది. కాబట్టీ బజార్లో దొరికే milk rusks or plain suzi rusks కొనుక్కుంటే సూప్స్ లోకి బావుంటాయి. త్వరగా ముద్దయిపోకుండా ఉంటాయి. ఏలక్కాయ ఫ్లేవర్(Ilaichi flavour) ఉన్న రస్కులు వస్తాయి. అవి మాత్రం సూప్ లోకి బావుండవు. కొనేప్పుడు ఫ్లేవర్ చూసుకుని కొనండి.

Labels: soups and appetizers 3 comments

quick & easy : దొండకాయ(Tendli/Ivy gourd) మొత్తుకూర!

3:50 PM | Publish by తృష్ణ



"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది. 

ఎలా చెయ్యాలంటే:
* ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :))


* పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని ఒక మొత్తుమొత్తండి. కోపం అన్నానని మరీ దొండకాయల్ని పచ్చడి చేసేయకండి. కాయ కాస్త చిట్లేలా(స్లిట్ అయ్యేలా) జస్ట్ అలా ఒక చిన్న దెబ్బ వెయ్యండి చాలు. ఇలా..



* తర్వాత చిన్న కుక్కర్(2 or 3 ltrs) తీసుకుని అందులో ఒక చెంచా ఆయిల్ వేసి, మొత్తి ఉంచిన దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, తొక్కిన వెల్లుల్లి రేకలు నాలుగు, పావు చెంచా పసుపు, పావు చెంచా జీలకర్ర పొడి, అర గ్లాసు నీళ్ళు(ఈ కొలతలు ఓ పావుకేజీ దొండకాయలకి) పోసి విజిల్ పెట్టేసి, రెండు  విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి. 
ఒకవేళ చిన్న కుక్కర్ లేకపోతే మూకుడులోనే ఇవన్నీ వేసి మూత పెట్టాలి. మూకుడైతే మరో అర గ్లాస్ ఎక్కువ నీళ్ళు పోయాలి.

* కుక్కర్ మూత తీసి నీళ్ళేమైనా మిగిలి ఉంటే ఇగిరేదాకా ఐదు నిమిషాలు కూరని పొయ్యిపై ఉంచాలి.

* ఉప్పుకారాలు చెక్ చేసుకుని అవసరమైతే కలిపాలి. ఒకవేళ ఎక్కువైతే కూరలో అరగ్లాస్ నీళ్ళు పోసి అటుఇటు కదిపి ఓ గిన్నెలోకి వంపేసుకోవాలి. అవి కూర ఉడికిన నీళ్ళు కాబట్టి తర్వాత ఏ చారులోకో వాడుకోవచ్చు.


 కూర అలానే తినేయచ్చు కానీ కూర ముక్కలు బాగా వేగినట్లు అవ్వాలి అనుకుంటే కుక్కర్లోంచి ఏదైనా పేన్/మూకుడు లోకి షిఫ్ట్ చేసి, ఒక చెంచా ఆయిల్ వేసి మధ్య మధ్య కదుపుతూ ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి.


* మూకుడులోనే ఉడకపెడితే నీళ్ళు ఇగిరిపోయాకా చెంచా ఆయిల్ వేసి, ముక్కలు బాగా వేగినట్లయ్యాకా ఆపేయాలి.


* అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర బావుంటుంది.

***   ***   ***

* దొండకాయ కారం పెట్టి చేసిన కూర రెసిపీ క్రింద లింక్ లో:
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html

***    ***

టిప్:

దొండకాయలు ఫ్రై చేసేప్పుడు కూడా ఇలా కాసిని నీళ్ళు పోసి చిన్న కుక్కర్లో పెట్టి, ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చాకా ఆపేసి, తర్వాత మూకుట్లో ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతుంది కూర + ఎక్కువ నూనె వాడక్కర్లేదు . ముక్కల్ని బట్టి కాసిని నీళ్ళు పోతే కాబట్టి కుక్కర్లో పెట్టినా కూర ముక్కలు పేస్ట్ అవ్వవు.

Labels: quick & easy, కూరలు 4 comments

వంకాయ-కొత్తిమీరకారం

1:12 PM | Publish by తృష్ణ






వంకాయ-కొత్తిమీరకారం చక్కగా నవనవలాడే లేత వంకాయలు మార్కెట్లో దొరికినప్పుడు నాకు గబుక్కున తట్టేది ఒకటే కూర "వంకాయ-కొత్తిమీరకారం". గుత్తి వంకాయలైనా, మామూలు వంకాయలైనా ఫ్రెషా కాదా అనేది వాటి ముచికను బట్టి తేల్చచ్చు. ఫ్రెష్ అయితే ముచిక ఆకుపచ్చగా ఉంటుంది. లేకపోతే కాస్త వాడినట్లు ఉండి రంగు మారిపోయి అసలు ఆకుపచ్చగానే ఉండవు.


ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి కొన్ని కూరల్లో వేసుకోవచ్చు. వంకాయల్లో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. నాకీ కొత్తిమీర అన్నది ఫేవొరేట్ కాబట్టీ దొండకాయ, బీరకాయ, ఆనపకాయ కూరల్లో కూడా ఈ కొత్తిమీర కారం వేస్తూంటాను. మా అన్నయ్య నాకన్నా ఒక మెట్టు పైకెక్కి కాకరకాయలో కూడా కొత్తిమీర కారం వేసి ఓరోజు వండాడు. (తినడానికి బాగానే ఉందిలెండి :))



వంకాయ-కొత్తిమీర కారం కూర తయారీ:
* పావుకేజీ వంకాయలు తోచిన విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లోకి తరుక్కోవాలి. ఇలా అయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.

* రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలు కడిగి చటుక్కున ఎండు మూడు భాగాలుగా తెంపి పెట్టుకోవాలి. (తెంపమనడం ఎందుకంటే దానికి చాకు అక్కర్లేదని అర్థం)

* మూడు, నాలుగు మీడియం సైజు పచ్చిమిరపకాయలు (ఇది ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు) కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి లేదా తొక్కుకున్నా సరే.

* మూకుట్లో కూరముక్కలు వేసి, ఆ ముక్కలకి సగం కొలతన నీళ్ళు పోసి, తగినంత(అరచెంచా) ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. (వంకాయల్లో తక్కువ ఉప్పు పడుతుంది. కాస్త ఎక్కువైనా కూరంతా ఉప్పు కషాయం అయిపోతుంది.)

* వంకాయముక్కలు సగం ఉడికిన తర్వాత రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కారాన్ని అందులో వేసేయాలి. (నూనె తినగలిగినవాళ్ళు మరో రెండు చెంచాలు నూనె వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.)


* కూర మాడకుండా మధ్య మధ్య కలుపుతూ దగ్గర పడ్డాకా స్టౌ ఆపేయడమే. 




ఆయుర్వేదం మందుకి వంకాయ తినకూడదు. అందుకని మందు వాడనప్పుడు మాత్రమే ఈ కూర వండడం అవుతుంది. సహజంగా మనిషికి ఏది లభ్యం కాదో దాని మీదే మోజు ఎక్కువ కదా.. అందుకని నా ఫేవరేట్ కూరల జాబితాలో ఈ కూర చేరిపోయింది :)

Labels: కూరలు 4 comments

చాక్లేట్ కేక్ without oven

8:45 PM | Publish by తృష్ణ



మా బుజ్జెమ్మ కోరికపై మొదటిసారి చాక్లేట్ కేక్ చేసాను.. ఇప్పుడే అయ్యింది. వేడివేడిగా తింటే బాగుంది..:)

ఓవెన్ లేకుండా చేసిన ప్రయోగం. ఎక్స్పరిమెంట్ చేసా కాబట్టి డేకరేట్ చెయ్యడానికి చెర్రీస్, క్రీం చెయ్యడానికి ఫ్రెష్ బటర్ రెడీగా లేవు. సో, ఈసారి మళ్ళీ చేసి డెకరేషన్ తో పాటూ రెసిపీ చెప్తాను :-)
 

Labels: experiments 1 comments

శెనగలు సాతాళింపు + శెనగ వడలు

8:12 PM | Publish by తృష్ణ



శ్రావణమాసంతో పాటూ శెనగలు రావడం కూడా మొదలైపోయింది.. మరి వాటిని ఎలా చెల్లుబాటు చేస్కోవాలో ఆలోచించాలి కదా! 
శెనగలతో ఏమేమి చేయచ్చు అంటే..
* ముందు వాటిని మూటకట్టి మొలకలు తెప్పించాలి. అప్పుడు వాడుకుంటే ఆరోగ్యకరం.
* మొలకెత్తిన పచ్చి శెనగలు ఓ గుప్పెడుదాకా తినగలం :)
* ఉడకబెట్టుకుని ఉప్పు,కారం వేసుకుని ఇంకాసిని తినచ్చు.
* ఇంకా వంకాయ, క్యేబేజీ మొదలైన కరల్లో, ఉప్మాల్లో కాసిని శెనగలు వేసేస్తూ ఉండచ్చు.  
* శనగలతో 'పాఠోళీ' మంచి కూర. రెసిపీ అప్పుడేప్పుడో చెప్పేసాను కదా..( http://ruchi-thetemptation.blogspot.in/2010/09/blog-post.html )

* chole masala with white chana
* chana masala with black chana

ఇక ఇప్పుడు రెండు చిన్న రెసిపీలు చెప్తాను..

1) శెనగలు సాతాళింపు: 


* సాతాళించు అంటే నూనెలో వేయించడం అని అర్థం. శెనగలన్నీ సరిపోయేంత ఎక్కువ నూనె అక్కర్లేదు కానీ  వాయినానికి వచ్చే దోసిడు శెనగలకి ఒక చెంచా నూనె చాలు.




* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఎండు మిర్చి చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించాలి. తర్వాత మొలకెత్తిన శెనగలు అందులో వేసి మూకుడుపై మూత పెట్టి అంది మీద కాసిని(అర గ్లాసుడు) నీళ్ళు పోయాలి. నాన్స్టిక్ పేన్ అయితే నీళ్ళు అక్కర్లేదు. క్లోజ్డ్ లిడ్ ఉంటుంది కాబట్టి.

* మధ్య మధ్య కలుపుతూ ఉంటే ఐదు నిమిషాల్లో శెనగలు వేగిపోతాయి. 

* ఉడకపెడితే మెత్తబదతాయి కానీ ఇలా చేయడం వల్ల శెనగలు మెత్తబడతాయి + క్రిస్పీగా ఉంటాయి కూడా.

* స్టౌ ఆపేసాకా వేగిన శనగలకి తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపి, కొత్తిమీర చల్లి, ఓ నిమ్మ చెక్కపిండితే... రుచి అద్భుత:  :-)

* శనగలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మూతలో నీళ్ళు పొయ్యకుండా ఓపెన్ గా ఫ్రై చెయ్యాలి. మరో స్పూన్ నూనె వెయ్యాలి. అంతకన్నా అక్కర్లేదు.


2) శెనగ వడలు:


కప్పుడు శెనగలు(సుమారు వందగ్రాములు)
రెండు పచ్చిమిరపకాయలు
అంగుళం అల్లం ముక్క
కాస్త కొత్తిమీర లేక పుదీనా(రెండిటికీ రెండు రకాల రుచి వస్తుంది)
ఒక మిడియం ఉల్లిపాయ ముక్కలు
రెండు చెంచాలు బియ్యప్పిండి


* ముందు శెనగలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర/ పుదీనా కలిపి మెత్తగా మిక్సీలో తిప్పేసుకోవాలి. మెత్తబడటానికి కాసిని నీళ్ళు పోసుకోవచ్చు.
* తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు శెనగల ముద్దలో కలపాలి. 
* రెండు చెంచాల బియ్యప్పిండి కూడా ఈ ముద్దలో కలపాలి.
* చిన్న చిన్నగా ముద్దలు తీసుకుని వడల్లా నూనెలో వేయించుకోవడమే. 
* ఇవి వేడిగా తింటే క్రిస్పీగా బాగుంటాయి. చల్లారిపోతే మెత్తబడిపోతాయి.

3)vadas with mix of corn kernels
3/4cup black chana
1/3cup corn kernels


Labels: snacks n sweets 4 comments

quick & easy : అటుకుల పులిహోర

5:52 PM | Publish by తృష్ణ





మా చిన్నప్పుడు ఎక్కువగా తిన్న ఈవినింగ్ స్నాక్ ఇది. ఈజీగా అయిపోతుందనేమో అమ్మ చేస్తూండేది. మహారాష్ట్రలో "కాందా పోహా" అని బ్రేక్ఫాస్ట్ గా ఇది ఎక్కువగా తింటూంటారు. అక్కడ హోటల్స్ లో కూడా ఇది ఒక ఐటెమ్ గా దొరుకుతుంది. మేం బొంబాయిలో ఉండగా మావారి ఆఫీసులో శనివారాలు బ్రేక్ఫస్ట్, లంచ్ పెట్టేవారు స్టాఫ్ కి . అప్పుడు రెగులర్ గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ "కాందా పోహా" ఉండేది వాళ్ళకి. తిని తినీ బోర్ కొట్టి ఇంక శనివారాలు ఆఫీసులో టిఫిన్ స్కిప్ చేసేస్తూ ఉండేవారు ఆయన. నాకు మాత్రం మహా ఇష్టం ఇది.


చెయ్యడం ఎలాగంటే:
 
* ఒక పెద్ద గ్లాసు అటుకులు కాస్త పావు గ్లాసు నీళ్ళు చల్లి తడిపాలి. ఎక్కువ నీళ్ళు పోసేస్తే అటుకులు ముద్దయిపోయి పొడిపొడిగా ఉండవు. అటుకులు స్ట్రైనర్ లో పెట్టి పైనుండి నీళ్ళు పోస్తే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నా చిల్లుల్లోంచి క్రిందకి పోతాయి.


* అలా తడిపిన అటులుల్లో ఉప్పు, పసుపు చల్లి కలిపి ఉంచాలి.

* ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి ఉంచాలి.

* మూకుడులో ఒక చెంచాల నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,మినపప్పు, వేరుశనగ గుళ్ళు, కర్వేపాకు,మిర్చి, ఇంగువ వేసి పులిహారకి మల్లే పోపు వేయించుకోవాలి.

*పోపు వేగాకా అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాకా స్టౌ ఆపేయాలి.

* తడిపి ఉంచిన అటుకులు అందులో వేసి బాగా కలిపి, ఒక చిన్న నిమ్మకాయ రసం తీసి అటుకుల పులిహారలో బాగా కలపాలి.

* కాస్త కొత్తిమీరతో అలంకరించి తినెయ్యడమే :)



బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగనే కాక రాత్రిపూట లైట్ గా భోజనం చెయ్యాలనుకున్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు.
 

Labels: quick & easy, snacks n sweets, పులిహోర 3 comments

quick & easy: పుదీనా కారం

6:35 PM | Publish by తృష్ణ




శరీరాన్ని చల్లబరిచే గుణమే కాక అరుగుదలకూ, ఎసిడిటీకీ కూడా మంచి మందైన పుదీనా అకులను ఏదో విధంగా భోజనంలో include చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా నిలవ పచ్చడి, పుదీనా కారం, పుదీనా రైతా మొదలైనవి నేను చేస్తుంటాను. ఇవాళ చాలా సులువుగా చేసుకునే పుదీనా కారం గురించి చెప్తాను.

కావాల్సినవి:
రెండు కట్టలు పుదీనా
రెండు, మూడు పచ్చిమెరపకాయలు
తగినంత ఉప్పు(సుమారు అర చెంచా)
అర చెక్క నిమ్మరసం

తయారీ:
* పుదీనా ఆకులు కడిగేసి, ఒక చిన్న చెంచాడు నూనెలో కొద్దిగా(మూడు నాలుగు నిమిషాలు) వేయించాలి. పచ్చివాసన పోతే చాలు. ఆకుపచ్చరంగు అలానే ఉండగానే ఆపేయాలి. రంగు మారితే ఆకులు బాగా వేగిపోయినట్లు. (పుదీనా కారానికి అలా అవసరం లేదు.)
* వేగిన ఆకు చల్లారాకా, పచ్చిమెరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పేయాలి.
* గిన్నెలోకి తీసాకా అరచెక్క నిమ్మరసం తీసి అందులో కలిపితే సరిపోతుంది.
* ఇందులోకి పోపూ కూడా అక్కర్లేదు.
* వేడి వేడి అన్నంలో ఈ పుదీనా కారం చాలా బాగుంటుంది.

టిప్:
ఇదే విధంగా కొత్తిమీర కారం కూడా చేసుకోవచ్చు. ఇది అయితే ఆకు వేయించక్కర్లేదు కూడా. పచ్చిదే మిక్సీలో తిప్పేయచ్చు.
ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి గ్రీన్ చట్నీ(పుదీనా లేదా కొత్తిమీర) మొదటి ముద్దలో తింటే మంచిది.

Labels: chutneys n పచ్చడ్స్, quick & easy 1 comments

quick & easy: చుక్కాకు పచ్చడి

3:05 PM | Publish by తృష్ణ


టూ మినిట్స్ మ్యాగీ కన్నా సులువు ఈ పచ్చడి చెయ్యడం. కరెంట్ లేదు.. మిక్సీ లేకుండా పచ్చడి ఎలా చెయ్యడం అన్న దిగులు ఉండదు. మిక్సీలో తిప్పాల్సిన అవసరం లేని ఈజీ అండ్ సింపుల్ పచ్చడి ఇది!

ఎలాగంటే:
* ముందు ఓ చిన్న చెంచా నూనెలో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా కట్టేసే ముందు అర చెంచా కారం వేసి బాగాకలిపి స్టౌ ఆపేయాలి. (కారం ఇష్టం లేకపోతే ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పోపులో వేయించాలి. కానీ ఇవి మళ్ళీ తొక్కుకోవాలి. సో,కారమే బెటర్)
* పోపు చిన్న గిన్నెలోకి తీసేసుకుని, మూకుడులో మళ్ళీ ఓ చెంచా నూనె వేసిన తర్వాత, కడిగి,తరిగి ఉంచిన రెండు కట్టలు చుక్కాకు వేసి, అర చెంచా ఉప్పు వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి.
* చుక్కాకు సుగుణం ఏంటంటే ఇట్టే పేట్ లా అయిపోతుంది. పచ్చడికి గ్రైండర్లో వేయక్కర్లేదు. అందుకే పోపులో కారం వేయమన్నా.

ఆకు కడిగిన తడి చాలు మళ్ళీ నీళ్ళు కూడా చల్లక్కర్లేదు. జస్ట్ బాగా కలుపుతూ ఉండాలి వెగేదాకా. లేకపోతే అడుగంటిపోతుంది ఆకు.
* ఈ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు.
* ఆకు బాగా దగ్గరపడి ముద్దలా అయిపోయాకా ఆపేసి, అందులో పోపు కలుపుకుని తినెయ్యడమే.
* అన్నం లోకీ దోశల్లోకీ కూడా బావుంటుందీ పచ్చడి.

టిప్:
* కావాలనుకుంటే ఆకు వేగేప్పుడు ఓ చిటికెడు ఆమ్చూర్ పౌడర్(డ్రై మ్యాంగో పౌడర్) వేస్తే కూడా బావుంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, quick & easy 4 comments

బెండకాయలు-శనగపప్పు కారం

7:19 PM | Publish by తృష్ణ





బెండకాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పై ఫొటోలో లాగ మధ్యకు చీరి, సన్నగా పొడుగ్గా ఉండేలా తరిగి కూర చేస్తే తినడానికీ, చూడటానికీ కూడా వెరైటీగా ఉంటుంది :) 
శనగపప్పు కారం ఎలా చెయ్యాలో క్రింద రెసిపీలో రాసాను. అక్కడ ఓసారి చూసి వచ్చేయండి..:)
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html

* ఈ శనగపప్పు కారం బీరకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ మొదలైన కూరల్లో వేసుకోవచ్చు.

* శనగపప్పు తినకూడనివాళ్ళు, పడనివాళ్ళూ అది లేకుండా మిగతా ఐటెంస్ తో పొడి గ్రైండ్ చేసుకోవచ్చు. కాస్త మినపప్పే ఎక్కువ వేసుకుంటే సరి.


తయారీ:
* మూకుడులో  రెండు చెంచాలనూనె వేసి,  మధ్యకు చీరి సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసి, కాస్త వేగాకా క్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు కారం, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి, మూతలో అర గ్లాసుడు నీళ్ళు పోయాలి. నాన్స్టిక్ పేన్ అయితే పైన క్లోజ్డ్ లిడ్ ఉంటుంది కదా అది పెట్టేస్తే సరిపోతుంది.

* కూర అయ్యేదాకా స్టౌ సిమ్ లోనే పెట్టాలి. అప్పుడే బాగా వేగుతుంది కూర.

*  ఐదు పదినిమిషాల తర్వాత ముక్కలు మెత్త బడ్డాయి అనిపించాకా మూత తీసేసి, మధ్య మధ్య కలుపుతూ ఓపెన్ గా వేయించాలి కూర. అప్పుడు బెండకాయలు జిగురువల్ల ముద్దగా అయిపోకుండా పొడిపొడిగా వస్తుంది కూర.



టిప్:
ఈ కూరలో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. శనగపప్పు కారం వేసేప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయచ్చు.


Labels: కూరలు 2 comments

oil free మొక్కజొన్న పొంగడాలు

6:41 PM | Publish by తృష్ణ



ఇదివరకూ మొక్కజొన్న వడలు, పొంగడాలు విడివిడిగా రెసిపీలు రాసాను . ఈసారి మొక్కజొన్నలతో పొంగడాలు చేయడం ఎలానో చెప్తానేం..!


మా నాన్నగారు హార్ట్ పేషంట్. ఆయిల్ బాగా తక్కువ వాడాలి కాబట్టి సాయంత్రం స్నాక్స్ క్రింద మా అమ్మ ఇలా రకరకాల పొంగడాలు వేస్తూంటూంది. మొక్కజొన్నలతోనే కాక బొబ్బర్లు, సోయా బీన్ గింజలు, మొలకెత్తిన పెసలు మొదలైనవాటితో రోజుకో రకం పొంగడాలు చేస్తుంది అమ్మ. పొంగడాలు వేసే గుంటల్లో ఒక చుక్క ఆయిల్ వేయచ్చు. డీప్ ఫ్రైడ్ ఐటేమ్స్ అవాయిడ్ చెయ్యాలనుకునేవారు ఇలా మొలకెత్తిన గింజలతో పొంగడాలు చేసుకుంటే ఆరోగ్యకరం.

ఇప్పుడు కూరల మార్కెట్లో, షాపింగ్ మాల్స్ లో అన్ని సీజన్స్ లో మొక్కజొన్నలు దొరుకుతున్నాయి కాబట్టి మొక్కజొన్నతో లేదా ఇష్టమైన వారు స్వీట్ కార్న్ తో కూడా ఈ పొంగడాలు చేయచ్చు.

మొక్కజొన్న పొంగడాలకు కావాల్సినవి:

మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్ గింజలు - ఒక కప్పు
చిన్న ఉల్లిపాయ - తరిగిన ముక్కలు 
చిన్న అల్లం ముక్క
రెండు పచ్చిమిరపకాయలు
చిన్న కట్ట కొత్తిమీర లేదా పుదీనా
రెండు చెంచాలు బియ్యప్పిండి 
తగినంత ఉప్పు

తయారీ:
* ముందుగా మొక్కజొన్న గింజలు, అల్లం, మిర్చి, కొత్తిమీర/పుదీనా, ఉప్పు కలిపి కాస్త నీళ్ళు కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేస్కోవాలి.
* ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాలు బియ్యప్పిండి కలిపి, పొంగడాలు గుంటల్లో ఒక చుక్క నూనె వేసి, పిండిని వేసి మూత పెట్టాలి.
* మూడు నాలుగు నిమిషాల తరువాత పొంగడాలు వెనక్కు తిప్పాలి.
* రెండువైపులా బాగా కాలాకా స్టౌ ఆపేయాలి.
* కొత్తిమీర/పుదీనా + అల్లం వేస్తాం కాబట్టి చట్నీ ఏమీ లేకపోయినా ఉట్టినే తినేయచ్చు.

టిప్:

* మొక్కజొన్న లేతది కాక కాస్త ముదిరినదైనా పొద్దున్నే గింజలు వొలిచి నోళ్ళల్లో నానబెడితే సాయంత్రానికి నాని రుబ్బుతే పేస్ట్ అవుతాయి.

ఇదే రెసిపీ పైన రాసినట్లు మొలకెత్తిన పెసలతో/ సోయా / బొబ్బర్లు మొదలైన నానబెట్టిన గింజలతో చేసుకుంటే  టీ టైం స్నాక్ గా బావుంటాయి. ఆయిల్ ఫ్రీ ఫుడ్ తప్పనిసరిగా తినాల్సినవాళ్ళకి ఆరోగ్యకరం, ఉపయోగకరం.





Labels: snacks n sweets 4 comments

కొత్తావకాయ + మెంతికాయ!

1:43 PM | Publish by తృష్ణ





ఊరగాయలు తినడమే మానేసామని ఈసారి అసలు ఆవకాయలూ అవీ వద్దనుకుంటూనే మొత్తానికి అనుకోకుండా పెట్టేసాను. ఏదో పని మీద బజారుకి వెళ్ళి అక్కడ ముక్కలు కొడుతుంటే చూసి ఉత్సాహం వచ్చేసి, గబగబా ఓ నాలుగు కాయల్ కొనేసి, ముక్కలు  కొట్టించేసి, పక్కనే వలిచిన వెల్లుల్లి అమ్ముతుంటే అవి కూడా కొనేసి, ఇంటికొచ్చేద్దారిలో పప్పు నూనె కూడా కొని,  ఇంటికొచ్చాకా రాత్రి పదకొండున్నరకి కూచుని ఆవకాయ పెట్టా :-)

ఇదివరకూ మూడురకాల ఆవకాయలు చెప్పా కానీ మామూలు వెల్లిల్లి ఆవకాయ రెసిపీ చెప్పలేదు. ఆ రెసిపీ కూడా అవసరం ఉన్నవాళ్ళకి ఉపయోగిస్తుందని ఇక్కడ ఇస్తున్నా.

ఈ రెసిపీ  ఓ నాలుగు పెద్ద మామిడి కాయలకి:


* salt, కారం 1:1 పాళ్ళు.
* ఆవపొడి మాత్రం అంతకు మరో అరగ్లాసు ఎక్కువ. 
(హైద్రాబాద్ లో ఉంటే నల్లకుంటలో దొరికే కారమైతే బెస్ట్! లేదా పెద్ద మిర్చి(లావుగా ఉండేది) కారం కొనుక్కోవాలి. అదైతే రంగు ఉంటుంది, కమ్మగా ఉంటుంది.
 ఈసారికి నేను నాలుగు కాయలే పెట్టాను. సో, త్రీ మేంగోస్ కారంతో సరిపెట్టేసా :))
* నూపప్పు నూనె 1/2 కేజీ తీసుకోవాలి. 
* powders అన్నీ బాగా కలిపేసి, అందులో పావు కేజీ నూనె వేసి, తొక్క తీసిన వెల్లుల్లిపాయలు(ఇవి కూడా రెడీగా దొరికేసాయి ఈసారి), వంద గ్రాములు మెంతులు వేసి మూత పెట్టేసి, మూడో రోజు మూత తీసి మిగిలిన పావు కేజీ నూపప్పునూనె కలిపేసి సీసాలోకెక్కించెయ్యడమే.


మెంతికాయ:

ఆవకాయ పెట్టిన తర్వాత కనీసం మెంతికాయ అయినా పెడదాం అనిపించి, ఓ మూడు కాయలతో మెంతికాయ కూడా పెట్టేసా. ఆ రెసిపీ ఇదివరకూ ఇక్కడ రాసా కాబట్టి ఇంక మళ్ళీ రాయట్లే. కొత్త మొంతికాయ ఫోటో మాత్రం పెడుతున్నా..:-)

* ఒక టిప్ ఏమిటంటే మెంతులు ఎంత దోరగా వేగితే, అంత కమ్మగా ఉంటుంది మెంతికాయ.






Labels: ఊరగాయలు-రకాలు 1 comments

Cooking tips -1

5:59 PM | Publish by తృష్ణ






చాలా రోజుల్నుంచీ నాకు తెలిసినవి, నేను పాటించేవి కొన్ని 'వంటింటి చిట్కాలు' రాయాలని.. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి.. కానీ కొత్తగా వంట మొదలుపెట్టే వారికి, తెలియనివారికి ఉపయోగపడతాయని రాస్తున్నాను.


1) ఆకు కూరలు ఫ్రిజ్ లో పెట్టేప్పుడు వేళ్ళు కట్ చేసేసి, న్యూస్ పేపర్లో గానీ, వేరే ఏదైన కాగితంలో గానీ చుట్టి కవర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి. పేపర్ని రోల్ చేసినట్లు కుట్టాలి. మొత్తం మూసెయ్యకూడదు. తాజా ఆకుకూరలయితే ఇలా పెట్టడం వల్ల ఒక వారం గ్యారెంటీగా ఉంటాయి.


2) కొబ్బరికాయ కొట్టాకా ఒక చెక్క వాడకుండా ఉండిపోతే అది ఐస్ క్యూబ్స్ తయారయ్యే డీప్ ఫ్రిజ్ లో పెడితే పదిహేను రోజులైనా పాడవదు. అంతకంటే ఎక్కువ ఉంచితే పాడవదు కానీ డ్రై అయిపోతుంది. కొబ్బరిలో రుచి ఉండదు.


3) దోశల పిండి నానబెట్టేప్పుడు రెండు చెంచాలు శనగపప్పు వేస్తే దోశలు క్రిస్పీగా హోటల్ దోశల్లా వస్తాయి. ఒక చెంచా మెంతులు, గుప్పెడు అటుకులు వేస్తే దోశలు మెత్తగా వస్తాయి. ఇడ్లీ పిండిలో కూడా ఇలా మెంతులు వేయచ్చు. కానీ ఎక్కువ వేయకుండా చూసుకోండి. ఎందుకంటే పిండి చేదయిపోతుంది. 


4) దోశలకి చాలా మంది 1:3 పోస్తారు కానీ ఒక గ్లాసు మినపప్పుకి, రెండు గ్లాసులు బియ్యo వేస్తే మెత్తగా కాక మరీ రేకుల్లా కాకుండా మీడియంగా వస్తాయి. 


5) బూరెలు చేసేప్పుడు పైన తోపుకి ఒక గ్లాసు మినపప్పుకి, ఒక గ్లాసు బియ్యం పోసి నానబెట్టాలి. పిండి రుబ్బేప్పుడు ఎక్కువనీళ్ళు పోయకుండా స్పూన్ తీస్తే జారేలా ఉంటే అప్పుడు బూరెలు చీదవు.


6) ఇడ్లీ పిండి వెట్ గ్రైండర్ లో రుబ్బేప్పుడు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ఇడ్లీరవ్వ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అదే మామూలు మిక్సీలో తిప్పేప్పుడు ఒకటికి, రెండు గ్లాసులు రవ్వ సరిపోతుంది కానీ రాత్రి రుబ్బినప్పుడు పావు చెంచా వంటసోడా పిండిలో కలిపి ఉంచేసి, పొద్దున్నే ఇడ్లీలు వేసుకుంటే పిండి బాగా ఫెర్మెంట్ అయ్యి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇలా సోడా కలిపేట్లయితే ఫ్రిజ్ లో పెట్టేప్పుడు పిండి గిన్నెలో పావు వంతు ఖాళీ ఉండేలా చూసుకుని, గిన్నె క్రిందన కూడా ఏదైనా బేసిన్ లేదా ప్లేట్ పెడితే ఫ్రెర్మెంట్ అయిన పిండి పొంగి ఫ్రిజ్ అంతా పడిపోకుండా ఉంటుంది. చలికాలం అయితే ఇలా ప్లేట్ లో పెట్టి బయట కూడా ఉంచేయచ్చు పిండి గిన్నె.



7) గారెలు చేసేప్పుడు పిండి పల్చనయిపోతే అందులో కాస్త బాజ్రా పిండి(సజ్జపిండి) కలిపితే పిండి మళ్ళీ గట్టిపడుతుంది. గారెలు కూడా టేస్ట్ మారవు.


8) అన్నాలు టేబుల్ మీద కాకుండా క్రింద కూచుని తినేమాటయితే, ముందో పాత న్యూస్ పేపర్ పరిచి అందిపై కంచాలు, గిన్నెలు పెట్టుకుని తింటే, క్లీనింగ్ పని తప్పుతుంది. తిన్నాకా పేపర్ మడిచి పారేయచ్చు.


9) చపాతీలు వత్తేప్పుడు, వంటింట్లో గట్టు మీద న్యూస్ పేపర్ పరుచుకుని, అంది మీద చపాతీ వత్తే పీట పెట్టుకుంటే గట్టంటా పిండి పడకుండా ఉంటుంది. కూరలు తరిగేప్పుడు కూడా సేమ్ ప్రొసిజర్ పాటిస్తే క్లీనింగ్ పని తప్పుతుంది.


10) పూరీ, చపాతీల్లోకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలు చేసుకునేప్పుడు టమాటా,ఉల్లిపాయ మిక్స్ ఎక్కువగా చెప్తారు. అలా కాకుండా ఆనపకాయ ముక్కలను కూడా కాస్త ఉడకబెట్టి గ్రైండ్ చేసేస్కుంటే మంచి గ్రేవీలా ఉపయోగపడుతుంది. పులుపు కావాలంటే ఒక అర చెంచా ఆమ్చూర్ పౌడర్(డ్రై మామిడి పొడి) కలుపుకోవచ్చు. 


11) పాత ఆవకాయ, మాగాయ మిగిలిపోతే క్వాంటిటీని బట్టి చూసుకుని,  బెల్లం పాకం పట్టి అందులో వేడిమీదే పాత ఆవకాయ లేదా మాగాయ వేసి ఓ రెండునిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి. బాగా కలిపి సీసాలో పెట్టేసి ఓ రెండు మూడు రోజుల తర్వాత వాడుకుంటే తియ్య ఆవకాయ, తియ్య మాగాయ రెడీ! పెరుగన్నంలోకీ, దోశల్లోకీ ఈ ఊరిన తియ్య ఊరగాయ చాలా బాగుంటుంది.


12) పొద్దున్న త్వరగా వంట కావాలంటే రాత్రి కూరలు తరిగి ఫ్రిజ్ లో పెట్టుకోవడమే కాక పోటాటో, బీట్ రూట్, కేరెట్, చామదుంప, అరటి లాంటి కూరలు కాయ పడంగా ఉడకపెట్టేసి ఉంచుకుంటే పొద్దున్నే ముక్కలు తరిగి పోపు పెట్టేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది.


13) పప్పులో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైతే కాస్త పెసరపప్పు(ఇది త్వరగా ఉడుకుతుంది కాబట్టి) ఉడకపెట్టేసి అందులో కలిపేస్తే ఉప్పు సరిపోతుంది.


14) ఓ వారానికి సరిపడా మనం వాడుకునే చింతపండు వేడి నీళ్లలో ఒక్క ఉడుకు రానిచ్చి, చల్లారాకా అలానే మూతపెట్టేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే అప్పటికప్పుడు నానబెట్టుకునే పని తప్పుతుంది.


15) చపాతీల కోసం ఈ మధ్యన మల్టీ గ్రెయిన్ ఆటాలు చాల రకాలు వస్తున్నాయి. అలా కాకుండా లూజ్ గోధుమ పిండి లేదా branded గోధుమపిండి కొనేసుకుని, అందులో మనకి కావాల్సిన చిరుధాన్యాల పిండి(జొన్న,రాగి,సజ్జలు,సోయా మొదలైనవి) కలుపుకుని చపాతీలు చేసుకుంటే టేస్ట్ కాస్త డిఫరెంట్ గా,వెరైటీగా ఉంటుంది.  ఒక రోజు జొన్న పిండి, ఒక రోజు రాగి పిండి, ఒకరోజు సజ్జ పిండి అలా కలుపుకోవచ్చు. (ఈ పిండిలన్నీ మార్కెట్లో విడివిడిగా దొరుకుతాయి.) ఒక గ్లాసు గోధుమపిండికి అర గ్లాసు జొన్న or రాగి or సజ్జ or సోయా పిండి కలుపుకోవచ్చు. ఇలా చేస్తే చపాతీలైనా, పుల్కాలైనా మెత్తగా వస్తాయి. చపాతీల రుచి కూడా మామూలుగానే ఉంటుంది + చిరుధాన్యాల్లోని పోషకాలు కూడా అందుతాయి.


ఈసారికి ఇవి! మరోసారి ఇంకొన్ని టిప్స్ రాస్తానేం..:-)

Labels: cooking tips 10 comments

దోసావకాయ + దోసావకాయ

4:59 PM | Publish by తృష్ణ





1.రెగులర్ దోసావకాయ:

పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్ లో అన్ని సీజన్స్ లో ఎక్కువగా కనబడే ఇంస్టంట్ ఆవకాయ..దోసావకాయ! అప్పటికప్పుడు అతిథులు వస్తున్నారంటే గబగబా వంట చేసేస్తాం కదా.. అలాంటప్పుడు చటుక్కున ఫ్రెష్ ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు దొరకని సీజన్ లో అయితే మిగతావాటికన్నా దోసావకాయ అయితే చాలా బావుంటుంది. ఓ గంట, రెండు గంటల్లో రెడీ అయిపోతుంది!
చేయడం కూడా ఈజీనే.. 

* ఒక అరకేజీ దోసకాయ ఉంటే, గింజలు తీసేసి తొక్కతో పాటూ సన్నగా పచ్చడికి తరిగినట్లు ముక్కలు తరిగేసుకోవాలి. ముక్క చేదు ఉందేమో చెక్ చేసుకోవాలి.

* 1/2 టీ గ్లాసు కారం, ఉప్పు, ఈ రెండీటికీ కాస్త ఎక్కువగా(సుమారు రెండు చెంచాలు) పచ్చి ఆవపొడి కలిపి, ముప్పావు టీ గ్లాసుడు నూనె వేసి మొత్తం బాగా కలపాలి.

* తరిగిన దోసకాయ ముక్కలని కలిపిన పిండిలో వేసేసి మళ్ళీ బాగా కలపాలి.

*దోసకాయ పులుపు కాబట్టి మిగతా కూరలతో చ్ఃఏసిన ఆవకయల్లోలాగ నిమ్మకాయ పిండక్కర్లేదు.

* దోసావకాయకి దోసకాయ గట్టిగా ఉండాలి, కాయ పులుపు ఉండాలి. అప్పుడు రుచి ఇంకా బావుంటుంది. 


2.పచ్చిమిరపకాయలతో దోసావకాయ:

దోసావకాయ అంటే చాలామందికి పైన రాసినదే తెలుసు. అదికాక పచ్చిమిర్చితో చేసుకునేది మరొకటి ఉంది. ఎర్ర దోసావకాయ కన్నా ఇది చాలా బావుంటుంది. ఇదివరకూ తృష్ణ లో రాసానీ రెసిపీ. ఒకచోట ఉంటాయని మళ్ళీ ఇక్కడ రాస్తున్నా!


తయారీకి కావాల్సినవి:
* ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.

* మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.

* ముందు మిక్సీలో పచ్చిమిరపకాయలన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.

* దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పేస్ట్ బాగా మిక్స్ అయినట్లు కనబడ్డాకా,

* అందులో తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.


"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.










Labels: ఊరగాయలు-రకాలు 2 comments

స్పెషల్ వడపప్పు !

10:11 AM | Publish by తృష్ణ




వడపప్పు రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా? ఇది అమ్మ మా చిన్నప్పటి నుండీ శ్రీరామనవమి కి చేసే స్పెషల్ వడపప్పు. పానకం, ఈ వడపప్పు పెద్ద గిన్నెతో చెస్తే అటొచ్చి ఇటొచ్చీ తినేసి సాయంత్రం అవ్వకుండానే నేనూ ,తమ్ముడూ రెండు గిన్నెలూ ఖాళీ చేసేసేవాళ్లం. అందులోనూ మా ఇంట్లో బెల్లం ఉండేది కాదు పంచదార పానకమే :) ఇంతకీ ఈ వడపప్పులో స్పెషల్ ఏంటంటే 'మామిడికోరు'! 

ఎలా చెయ్యాలంటే..

ఒక టీ గ్లాస్ నానబెట్టిన పెసరపప్పు
ఒక చెక్క కొబ్బరికోరు
చిన్న మామిడికాయ కోరు(మామిడికాయ పుల్లటిదైతే  కొబ్బరికోరులో సగం ఉండేలా చూసుకోవాలి 
సన్నగా తరిగిన ఒక పచ్చి మిరపకాయ
అరచెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.
చిన్న చెంచాడు ఉప్పు


* నానిన పెసరపప్పు తడి లేకుండా వాడేసి ఒక గిన్నెలోకి తీసుకుని, పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి.
* పచ్చి మిరపకాయ ఇష్టం లేకపోతే కాస్త కారం వేసుకోవచ్చు.


చెప్పాలంటే, ఇదో మంచి సలాడ్. కొబ్బరి, మామిడి రెండిటిదీ భీభత్సమైన కాంబినేషన్ కదా..అందులోనూ కూరల్లో వేసేకన్నా raw కొబ్బరి తింటేనే మంచిది అంటారు కూడా. శ్రీరామనవమి కే కాక మామూలుగా కూడా ఈవినింగ్స్ స్నాక్ లాగ పచ్చి మామిడికాయలు దొరికినంత కాలం ఇది చేసుకుని తినచ్చు. కానీ ఇలా తినేప్పుడు పెసరపప్పు కాస్త తక్కువ వేసుకుంటే ఏమీ చెయ్యకుండా ఉంటుంది.


Labels: salads 2 comments

మసాలా గారె with సంబార్!

9:08 AM | Publish by తృష్ణ




వీకెండ్స్ లో గానీ, కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు గానీ హెవీ టిఫెన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా.. సాంబార్ ఇడ్లీ బదులు సాంబార్ గారె చేస్తే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు?

 గారెలు వేసే మినప్పిండిలో కాస్త అల్లం,పచ్చిమిరపకాయలు కలిపితే మసాలా గారెలు అయిపోతాయి కదా!

* ఎంత క్వాంటిటీకి అంటే 250gms మినపప్పుకి పది పన్నెండు పచ్చిమిరపకాయలు, రెండంగుళాల అల్లం సరిపోతుంది.

* అందులో తోటకూర ఇష్టం ఉంటే, కడిగి, సన్నగా తరిగిన రెండు కట్టలు తోటకూర తరుగు కూడా కలపచ్చు.

* మినపప్పు ఒక గంట,గంటన్నర నానితే చాలు గారెలు నూనె పీల్చుకోవు.

* సాంబార్ మామూలుగా చేసేసి అందులో వేడి వేడి గారెలు వేసేస్తే మసాలా గారె with సంబార్ రెడీ :)


టిప్:
* మినపప్పు రుబ్బేప్పుడు పొరపాటున ఎక్కువ నీళ్ళు తగిలి పిండి పల్చన అయిపోతే గారెలు నూనె పీల్చేస్తాయి + రౌండ్ గా రావు. అలాంటప్పుడు పిండిలో కాస్త bajra flour అంటే సజ్జ పిండి కలిపితే పిండి గట్టిపడుతుంది.


* ఇంట్లో సాంబార్ పొడి చేసుకునే విధానం రాసిన పోస్ట్ లింక్:
http://ruchi-thetemptation.blogspot.in/2011/03/blog-post_23.html

Labels: tiffins 2 comments

అంతా mango మయం... !! (Raw Mango recipies)

8:15 PM | Publish by తృష్ణ



"అంతా mango మయం... మార్చంతా mango మయం..." అని పాడుకునేదాన్ని ఒకప్పుడు.. కొన్నేళ్ల పాటు! పచ్చి మామిడికాయలు మార్కెట్లో కనబడ్డం ఆలస్యం.. మా అత్తగారు అలా కొంటూనే ఉండేవారు సీజన్ అయ్యేదాకా. సీజన్ లో పచ్చిమామిడి కాయలు వస్తూంటే మా అమ్మ ఆవబద్దలు, మెంతి బద్దలు మాత్రం వేసేది. నేనేమో పచ్చి మామిడి జ్యూస్ , చుండో  చేసేదాన్ని. ఇంకా పచ్చిమామిడి పులుసు మా అన్నయ్య బాగా చెస్తాడు. నే చెయ్యలేదెప్పుడు...తినేవాళ్ళు లేక :( 
కానీ మా అత్తగారు మాత్రం వారంలో నాల్రోజులు మామిడివంటలే చేసేవారు. కొబ్బరికాయ - మామిడికాయ పచ్చడి ఆవిడకి ప్రాణం. ఇంకా మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, ఆవబద్దలు, మెంతి బద్దలు ఇలా రకరకాల వంటకాలు చేసేసేవారు. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసేవారు కూడా. ఆ రకంగా నాక్కూడా సీజన్ రాగానే పచ్చిమామిడికాయలు కొని ఈ ఐటెంస్ అన్నీ చెయ్యడం అసంకల్పితంగా వచ్చేసింది..:) ఈ నెల్లో చేసిన పచ్చిమామిడి వంటలు...



మామిడి పిండెలతో ఆవబద్దలు: 

http://ruchi-thetemptation.blogspot.in/2012/04/blog-post.html


మెంతి బద్దలు:



రెసిపిలతో కాకుండా ఈ రెసిపీ విడిగా ఇదివరకూ రాసాను :)
http://ruchi-thetemptation.blogspot.in/2011/04/blog-post_10.html






మామిడికాయ పప్పు:



పప్పు రెసిపీ రాసేదేముంది.. 
* ముక్కలు పప్పు కలిపి కుక్కర్లో ఉడికించాకా, 
* ఆవాలు,మినపప్పు,జీలకర్ర,వెల్లుల్లుపాయలు, కర్వేపాకు,ఎండుమిరపకాయలు,పసుపు,ఇంగువ లతో చక్కని పోపు వేసుకోవడమే.



మామిడికోరు పులిహోర:

* 250gm రైస్ తో అన్నం వండాలి.
* మీడియం సైజ్ మామిడికాయ ఇలా కోరుకోవాలి.



* తర్వాత మామూలు పులిహోరకు వేయించుకున్నట్లే పోపు వేయించుకోవాలి. 

* అదనంగా ఐదారు జీడిపప్పు పలుకులు, రెండు అంగుళాలు అల్లంముక్క కోరి పోపులో వేస్తే అదనపు రుచి!

మామిడికోరు పులిహోర



 కొబ్బరికాయ - మామిడికాయ పచ్చడి:



* ఒక పెద్దకప్పు కొబ్బరి ముక్కలకి, అందులో అర కప్పు పచ్చిమామిడి ముక్కలు, పోపులో వేయించిన రెండు ఎండు మిరప, రెండు పచ్చిమిర్చి, నాలుగు కొత్తిమీర రొబ్బలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసాకా మిగిలిన పోపు కలపాలి. 

* మామిడి ముక్కలు ఎక్కువైపోతే పుల్లగా బావుండదు పచ్చడి. కాబట్టి కాయ పులుపుని బట్టి మామిడి ముక్కలు తక్కువగా వేసుకోవాలి.

* అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటూంటే ఉంటుందీ.... సూపరంతే!

***   ***    ****

ఆవకాయలు   మాగాయలు  రకాలు, రెసిపీలు ఆ లింక్స్ లో..! 



Labels: chutneys n పచ్చడ్స్, పప్పులు, పులిహోర 2 comments

పచ్చిటమాటా + పల్లీ చట్నీ

12:13 PM | Publish by తృష్ణ




ఇదివరకూ పచ్చి టమాటా తో మెంతి బద్దలు పెట్టుకోవడం రాసా కదా.. ఇప్పుడు పచ్చి టమాటా చట్నీ ఎలానో చూద్దాం! పండుటమాటాలు పచ్చడి చేసుకున్నట్లు సేమ్ ప్రొసీజర్ లో అన్నంలోకి పచ్చడి చేసుకోవచ్చు. (చింతపండు అక్కర్లేదు)
అలా కాకుండా టిఫిన్స్ లోకి కాసిని పల్లీలు వేసి చట్నీ చేసుకుంటే చాలా బావుంటుంది.


ఎలాగంటే..

* పావుకేజీ పచ్చి టమాటాలు కడిగి, ముక్కలు చేసి రెండు చిన్న చెంచాల నూనెలో వేయించాలి. మూకుడు పైన మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి.

* తర్వాత 50gms 0r 100gms పల్లిలు పొడిగా వేయించుకుని పొట్టు తీసేయాలి. (పల్లీ పచ్చడికి పొట్టు తీసేస్తాం కదా..అలాగ!)

* అర చెంచా ఆవాలు, చెంచా మినపప్పు, అర చెంచా జీలకర్ర, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ వేసి పోపు వేయించాలి. చివరలో చిన్న కట్ట కొత్తిమీర కడిగి అది కూడా పోపులో వేసేసి స్టౌ ఆపేయాలి. కొత్తిమీర వేగక్కర్లేదు. వేడికి ఆకులు మగ్గితే చాలు.

* ముందు ఓసారి పల్లీలు పొడి అయ్యేలా మిక్సీలో తిప్పేసుకోవాలి.

* తర్వాత వేగిన పచ్చిటమాటా ముక్కలు, పోపులో వేగిన మిరపకాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు అందులోనే వేసి చెట్నీ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

* ఈ చట్నీ ఇడ్లీల్లోకీ, అన్నిరకాల దోశల్లోకీ బాగుంటుంది.


Labels: chutneys n పచ్చడ్స్ 4 comments

అడై దోశ (Adai dosa)

5:12 PM | Publish by తృష్ణ





'అడై' తమిళనాట బాగా ఫేమస్సు! ఊతప్పం లాగనే 'అడై' కూడా కాస్త మందంగా ఉంటుంది కానీ అడై పిండితో దోశ కూడా వేయచ్చు. మందంగా కాకుండా మామూలు దోశలా ఉండి. టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

కావాల్సినవి:

మామూలు బియ్యం లేదా ఉప్పుడు బియ్యం: 11/2 cup
మినపప్పు :1/2 cup (వెయ్యకపోయినా పర్లేదు. ఇది నా సొంత ఆప్షన్ :))
పెసరపప్పు: 1/2 cup
శనగపప్పు: 1/2 cup
కందిపప్పు: 1/2 cup
రెండు మూడు ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు
పావు చెంచా ఇంగువ
అర చెంచా మెంతులు
రెండు కేరెట్లు: తురిమినవి
రెండు ఉల్లిపాయలు: సన్నగా తరిగినవి
అంగుళం అల్లం ముక్క
చిన్న కట్ట కొత్తిమీర


తయారీ: 
* ముందుగా బియ్యం, పప్పులన్నీ + మెంతులు ఓమాటు కడిగి, రెండు మూడు గంటలు నానబెట్టాలి.

* నానిన పప్పులన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. 

* ఎండుమిర్చి వేయాలంటే పప్పులతో పాటే నానబెట్టేసి రుబ్బేయాలి. పచ్చిమిరపకాయలైతే డైరెక్ట్ గా నానిన పప్పులతో కలిపి రుబ్బచ్చు. (నేను పచ్చిమిరపకాయలు వేసాను)

* రుబ్బిన పిండిలో ఉప్పు , ఇంగువ, కేరెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

* పెనం కాలాకా దోశలాగ వేసి బాగా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. మామూలు దోశ కన్నా కాస్త ఎక్కువ సేపు కాలాలి ఇది. అడై దోశ ఎంత రో్స్ట్ అయితే అంత రుచి. బటర్ తో కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి ఈ దోశలు :)







* ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసి ఊతప్పం లాగ మందంగా వేసుకోవచ్చు. ఇలా..



* ఉల్లిపాయ ముక్కలు కేరెట్ కోరులాగ దోశ పిండిలో కలపేయకుండా దోశ వేసాకా పైన చల్లాలి. అలా అయితే దోశ సన్నగా వస్తుంది. ఉల్లిపాయముక్కలు వేసేస్తే పిండి రౌండ్ గా స్ప్రెడ్ చేసేప్పుడు అవి ఆడ్డం వచ్చేస్తాయి. 

* ఇందులోకి అల్లం, కొబ్బరి, పచ్చిటమాటా మొదలైన చట్నీలు బావుంటాయి. పైన ఫోటోలోది పల్లీలు+కొత్తిమీర కలిపి చేసిన చట్నీ.

Labels: chutneys n పచ్చడ్స్, tiffins, దోశలు రకాలు 11 comments

క్రీమీ పాస్తా (Creamy Pasta in White Sauce)

5:21 PM | Publish by తృష్ణ

Pasta in white Sauce without adding cream

ఓసారి ఓ బఫే లంచ్ కి వెళ్లినప్పుడు అక్కడ 'లైవ్ పాస్తా కౌంటర్' లో 'ఫుల్ క్రీమ్ పాస్తా' టేస్ట్ చూసినప్పటినుండీ అది చెయ్యమని మా అమ్మాయి పేచీ! మ్యాగీ వాళ్ళదో ఎవరిదో రెడీమేడ్ క్రీమీ పాస్తా(టూ మినిట్స్ మ్యాగీ లాంటిది) కొన్నాం కానీ అది బాలేదుట. హోటల్లో చేసినట్లే కావాలని గొడవ. సరే మరి తప్పుతుందా? పాస్తా కొనుక్కొచ్చా. ఆ పాస్తా రకాల్లో నాకన్నింటి కన్నా ఇలాంటివే నచ్చుతాయి.




రెసిపీ గూగులించి మొత్తానికి తయారు చేసా! అమ్మాయికీ, వాళ్ల నాన్నకీ బాగా నచ్చింది. మరి నాలా ఇప్పటిదాకా చెయ్యనివాళ్లెవరైనా ఉంటే ఇలా చేసేసుకోండి..

తయారీ:

* ముందుగా పాస్తా ని బోలెడు నీళ్ళలో.. అంటే ఒక కప్పు పాస్తా అయితే నాలుగు కప్పుల నీళ్లలో ఓ చెంచా ఉప్పు వేసి మరిగించాలి. పాస్తా ఉడికాకా చల్లటి నీళ్లతో వడబోసేసి ఒక చెంచా నునె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉంటుంది పాస్తా.(నూడుల్స్ లాగానే)



* తర్వాత ఓ కేరెట్, కాస్తంత స్వీట్ కార్న్ గింజల్ని కాస్త ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. (కేప్సికమ్, కేబేజ్ సన్నగా తురుముకుని అవి కూడా ఉడికించవచ్చు) ముక్కలు మరీ మెత్తగా ఉడకనఖ్ఖర్లేదు. 
* తర్వాత ఓ చెంచా బటర్ లో ఈ కూరముక్కలు 2mins వేయించి పావు చెంచా మిరియాల పొడి వేసి పక్కన పెట్టాలి.


 వైట్ సాస్ తయారీ:


* రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, రెండు చెంచాల బటర్ లో( సాల్టెడ్ బటర్ కాకుండా ఫ్రెష్ బటర్ నెయ్యి అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. అదైతే మంచిది. నేను ఇంట్లో చేసిన వెన్న వాడాను.) నల్లబడకుండా రెండు నిమిషాలు వేయించాలి. 

* తర్వాత ఒక కప్పుడు పాలు(150gms) అందులో పోసి ఉండలు లేకుండా కలుపుతూ సాస్ చిక్కబడనివ్వాలి. మరీ ముద్దగా ఉంటే కాసిని నీళ్లు కలుపుకోవచ్చు. స్టౌ ఆపే ముందర అర చెంచా సాల్ట్, చిటికెడు పెప్పర్ వేసి బాగా కలపాలి.

* ఈ వైట్ సాస్ మిశ్రమాన్ని చల్లారాకా ఓమాటు వడబోసుకుంటే వైట్ సాస్ క్లియర్ గా ఉంటుంది ఉండలు లేకుండా. 
(ఇలా తయారైన సాస్ ను ఫ్రిజ్ లో పెట్టుకుని ఓ వారం లోపూ మరేదైనా కూరలోకి వాడుకోవచ్చు.)



*ఇప్పుడు ఉడికించి ఉంచిన పాస్తా, ఈ వైట్ సాస్, కూరముక్కలు అన్నీ కలిపి ఫ్రైయింగ్ పేన్ లో వేసి, అరచెంచా ఆరిగానో(Oregano) వేసి, ఓ రెండుమూడు నిమిషాలు బాగా కలిపి స్టౌ ఆపేయాలి. ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవాలి.
Oregano పుదీనా జాతికి చెందిన హెర్బ్. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదివరకు పీజ్జా చేసేప్పుడు కొనేదాన్ని నేను. ఆరిగానో లేకపోయినా పర్వాలేదు నాలుగు కొత్తిమీరఆకులు కాస్త సన్నగా తరిగి వేసేస్తే సరిపోతుంది :)


* తయారైన పాస్తాలో ఒక అర కప్పు అముల్ క్రీమ్ కలిపి సర్వ్ చేయండి. Heaven! అంతే!




Labels: experiments, snacks n sweets 2 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ▼  2014 (24)
    • ▼  December (2)
      • జొన్న మొలకల ఉప్మా (Upma with Sprouted jowar)
      • టమాటా సూప్
    • ►  November (2)
      • quick & easy : దొండకాయ(Tendli/Ivy gourd) మొత్తుకూర!
      • వంకాయ-కొత్తిమీరకారం
    • ►  September (1)
      • చాక్లేట్ కేక్ without oven
    • ►  July (2)
      • శెనగలు సాతాళింపు + శెనగ వడలు
      • quick & easy : అటుకుల పులిహోర
    • ►  June (4)
      • quick & easy: పుదీనా కారం
      • quick & easy: చుక్కాకు పచ్చడి
      • బెండకాయలు-శనగపప్పు కారం
      • oil free మొక్కజొన్న పొంగడాలు
    • ►  May (3)
      • కొత్తావకాయ + మెంతికాయ!
      • Cooking tips -1
      • దోసావకాయ + దోసావకాయ
    • ►  April (2)
      • స్పెషల్ వడపప్పు !
      • మసాలా గారె with సంబార్!
    • ►  March (7)
      • అంతా mango మయం... !! (Raw Mango recipies)
      • పచ్చిటమాటా + పల్లీ చట్నీ
      • అడై దోశ (Adai dosa)
      • క్రీమీ పాస్తా (Creamy Pasta in White Sauce)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    OTT Entertainment - 3 : 8 వసంతాలు
    2 weeks ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.